Central minister kishan Reddy on Urea shortage in Telangana: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో యూరియా కొరతపై స్పందిస్తూ, అంతర్జాతీయంగా ఉన్న సవాళ్లు ఉన్నప్పటికీ రైతులకు ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో మూతబడిన యూరియా కర్మాగారాలను తిరిగి ప్రారంభించి ఉత్పత్తి పెంచినట్లు తెలిపారు.
ధరలు పెంచకుండా సబ్సిడీ కొనసాగింపు
ప్రపంచవ్యాప్తంగా యూరియా ధరలు పెరిగినా, భారత్‌లో మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచకుండా రైతులకు భారం పడకుండా చూస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి కేబినెట్ సమావేశంలో సబ్సిడీని పెంచుతూ రైతులపై ఒత్తిడి లేకుండా చూస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న స్టాక్‌ను సక్రమంగా నిర్వహించడంలో సమస్య ఉందని, యూరియా దుర్వినియోగం కాకుండా చూడాలని ఆయన సూచించారు.
తెలంగాణకు భారీగా యూరియా సరఫరా
తెలంగాణకు యూరియా సరఫరాపై కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. కరైకల్ పోర్టులో 10,000 మెట్రిక్ టన్నులు, ఇఫ్కో నుంచి 15,000 మెట్రిక్ టన్నులు, క్రిభ్ కో నుంచి 17,500 మెట్రిక్ టన్నులు, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ నుంచి 7,500 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తోందని వివరించారు. మొత్తం 50,000 మెట్రిక్ టన్నుల యూరియా మార్గంలో ఉందని తెలిపారు.
రాష్ట్ర మంత్రులు యూరియా కొరత గురించి నిరంతరం మాట్లాడటం వల్ల రైతులు ఆందోళన చెంది, యూరియాను నిల్వ చేసుకోవడం సమస్యకు ఒక కారణమని దీనిపై కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గత 11 ఏళ్లలో యూరియా కొరత ఎప్పుడూ రాలేదని, రైతులను భయపెట్టడం సరికాదని అన్నారు. తెలంగాణకు 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, ఇప్పటికే అంత మొత్తం సరఫరా చేశామని, అదనంగా మరో 2 లక్షల టన్నులు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. వర్షాలు బాగా కురిసినందున, రైతులు పంటలు పండించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


