Saturday, November 15, 2025
HomeతెలంగాణVande Bharat : వందే భారత్ జోరు... సామాన్యుడికి బేజారు!

Vande Bharat : వందే భారత్ జోరు… సామాన్యుడికి బేజారు!

Vande Bharat train delays : “ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది” అన్న చందంగా తయారైంది రైలు ప్రయాణికుల పరిస్థితి. ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టేందుకు, సామాన్యుడు ఆశ్రయించే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గంటల తరబడి కళ్లెం వేస్తున్నారు. యాదాద్రి భువనగిరి వంటి కీలక స్టేషన్‌లోనే ఈ పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికుల సహనం నశిస్తోంది. అసలు వందే భారత్ కోసం ఇతర రైళ్లను ఎందుకు నిలిపివేస్తున్నారు..? ప్రయాణికుల గోడు పట్టించుకునే వారే లేరా..?

- Advertisement -

సికింద్రాబాద్ – కాజీపేట మార్గంలో ప్రయాణం ప్రయాణికులకు నరకంగా మారుతోంది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో యాదాద్రి భువనగిరి, ఆలేరు, జనగామ, వరంగల్ వెళ్లేందుకు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఎక్కే ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ మార్గంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, నాగ్‌పూర్‌లకు రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు అడ్డంకులు లేకుండా చేసేందుకు, ఇతర రైళ్లను గంటల తరబడి నిలిపివేస్తున్నారు.

వందే భారత్ రైళ్లకు సికింద్రాబాద్ తర్వాత నేరుగా వరంగల్‌లోనే హాల్ట్ ఉంది. దీంతో, ఈ రైలు వెళ్లే సమయంలో గోల్కొండ వంటి ఎక్స్‌ప్రెస్‌లను భువనగిరి లేదా ఇతర సమీప స్టేషన్లలో గంటకు పైగా ఆపేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో రైలును ఆశ్రయిస్తే, ఇక్కడ కూడా గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. తమ విలువైన సమయం వృథా అవుతోందని, తగినన్ని రైల్వే ట్రాక్‌లు ఉన్నప్పటికీ ఈ వివక్ష ఎందుకని అధికారులను ప్రశ్నిస్తే సమాధానం రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భువనగిరిపై చిన్నచూపు: యాదాద్రి పుణ్యక్షేత్రానికి ముఖద్వారంగా, జిల్లా కేంద్రంగా ఉన్న భువనగిరి రైల్వే స్టేషన్‌కు దక్షిణ మధ్య రైల్వే ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టేషన్‌లో డిజిటల్ కోచ్ పొజిషన్ డిస్‌ప్లే సిస్టం లేకపోవడం ప్రయాణికులకు శాపంగా మారింది. నిమిషం పాటు ఆగే సూపర్‌ ఫాస్ట్ రైళ్లలో తమ రిజర్వేషన్ బోగీ ఎక్కడ ఉందో తెలియక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. రైల్వే సిబ్బంది మ్యాన్యువల్‌గా కోచ్‌ల సమాచారాన్ని చదువుతున్నా, ఆ కొద్ది సమయంలోనే రైలు ఎక్కేందుకు ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు.

ఇక్కడ కేవలం 26 రైళ్లకు మాత్రమే హాల్ట్ ఉంది. శాతవాహన, తెలంగాణ, పద్మావతి వంటి కీలక రైళ్లతో పాటు ప్రతిష్టాత్మక వందే భారత్ రైలు కూడా ఇక్కడ ఆగకపోవడంపై స్థానికులు, ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ ఈ పక్షపాత ధోరణిని విడనాడి, వందే భారత్ కోసం ఇతర రైళ్లను గంటల తరబడి నిలిపివేయడం ఆపాలని, భువనగిరిలో మరిన్ని రైళ్లకు హాల్ట్ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad