ఇవాళ వసంత పంచమి(Vasanta Panchami) కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సరస్వతిదేవి ఆలయాలు రద్దీగా మారాయి. ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచిదనే నమ్మకం. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసర సరస్వతి దేవి(Basara Saraswati Temple) ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు సోమవారం కావడంతో ఆదివారం నుంచి ఆలయానికి భక్తులు పెద్ద మొత్తంలో చేరుకున్నారు. తెల్లవారుజామున నుంచే తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు క్యూకట్టారు.
ఈ నేపథ్యంలో దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకొని వీఐపీ సేవల ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రి వరకు ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.