Hyderabad Police Commissioner: ఆర్టీసీ ఎండీగా ప్రయాణికుల మనసు గెలుచుకున్న అధికారి.. సైబరాబాద్ సీపీగా నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కఠిన వైఖరికి మారుపేరు.. వీసీ సజ్జనార్ మళ్లీ ఖాకీ పగ్గాలు చేపట్టారు. హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన, తన మార్క్ పాలనకు తొలి రోజే శ్రీకారం చుట్టారు. మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల కట్టడే తన ప్రథమ కర్తవ్యమని కుండబద్దలు కొట్టారు. మరి, సజ్జనార్ రాకతో నగరంలో నేరాల తీరుతెన్నులు ఎలా మారనున్నాయి? ఆయన ముందున్న ప్రధాన సవాళ్లేంటి?
మహిళల భద్రతే ప్రథమ ప్రాధాన్యం : హైదరాబాద్ నూతన సీపీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సజ్జనార్ తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. “మహిళల జోలికి వెళ్తే చాలా సీరియస్‌గా వ్యవహరిస్తాం. అఘాయిత్యాలకు పాల్పడితే ఎవ్వరినీ వదిలిపెట్టం” అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. నగరంలో నేరాల నియంత్రణకు సీసీటీవీల నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠం చేస్తామని, ప్రతి భవనం వద్ద తప్పనిసరిగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. సైబర్‌పై పదునైన వ్యూహం : దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు డ్రగ్స్, సైబర్ నేరాలు పెను సవాళ్లుగా మారాయని సజ్జనార్ అన్నారు. ఈ రెండు మహమ్మారులపై తనదైన శైలిలో యుద్ధం ప్రకటించారు.
“దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డ్రగ్స్. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సైబర్ నేరస్థులు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసం చేస్తున్నారు. స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో వచ్చే కాల్స్‌పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.”
– వీసీ సజ్జనార్, హైదరాబాద్ సీపీ
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయవద్దని వీఐపీలకు విజ్ఞప్తి చేసిన ఆయన, ‘డిజిటల్ అరెస్టు’ వంటి కొత్త తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.
‘రోడ్ టెర్రరిస్టులను’ వదిలేది లేదు : నగరంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సజ్జనార్ భరోసా ఇచ్చారు. ముఖ్యంగా, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “మద్యం తాగి రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తప్పవు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిని ‘రోడ్ టెర్రరిస్టులు’గా పరిగణిస్తాం. వారిని వదిలే ప్రసక్తే లేదు,” అని స్పష్టం చేశారు.
ప్రజల భాగస్వామ్యంతోనే పోలీసింగ్ : హైదరాబాద్ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుందని, దాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని సజ్జనార్ అన్నారు. సైబరాబాద్‌లో పనిచేసినప్పుడు ప్రజల నుంచి లభించిన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ, బాధ్యత కలిగిన ప్రతి పౌరుడూ ఒక పోలీసుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పోలీసింగ్‌లో డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తామని, హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్ వన్ నగరంగా నిలపడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.


