Saturday, November 23, 2024
HomeతెలంగాణVemula: గిరిపుత్రుల అస్తిత్వం, గౌరవానికి ఇది ప్రతీక

Vemula: గిరిపుత్రుల అస్తిత్వం, గౌరవానికి ఇది ప్రతీక

చెట్ల నరికివేతకు స్వస్తి పలికి...అడవుల సంరక్షణకు పాటుపడాలి

పోడు భూములకు పట్టా పాస్ బుక్కుల పంపిణీతో ఇకపై గిరిజనులకే పోడు భూములపై పూర్తి హక్కులు లభించాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బిక్కుబిక్కుమంటూ, భయంభయంగా పంట పండించే దుస్థితి దూరమయ్యిందని అన్నారు. పట్టాల పంపిణీతో యజమానులుగా మారిన గిరిజనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ధైర్యంగా పంటలు సాగు చేసుకోవచ్చని సూచించారు.

- Advertisement -


భీంగల్ మండలం తాళ్ళపల్లి గ్రామంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు పోడు భూముల పట్టా పాస్ బుక్కులు పంపిణీ చేశారు. దేవక్కపేట, దేవన్ పల్లి, కారేపల్లి, కుప్కాల్, మెండోరా, రహత్ నగర్, సికింద్రాపూర్, తాళ్ళపల్లి గ్రామాలకు చెందిన అర్హులైన 1007 గిరిజన కుటుంబాలకు పోడు భూముల పట్టా పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతో అడవి బిడ్డలకు భరోసా ఏర్పడిందని, వారి భావితరాల జీవనోపాధికి కూడా భద్రత లభించిందని మంత్రి తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కలిగిన ఆనందం తరహాలోనే ప్రస్తుతం గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం ఎంతో సంతోషం కలిగించిందన్నారు.

ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మందికి నాలుగు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు అందిస్తోందని వివరించారు ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో 4300 మందికి 8600 ఎకరాల భూములు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 1478 మందికి సుమారు రూ. 400 కోట్ల విలువ చేసే 4000 ఎకరాల పోడు భూముల పంపిణీ జరుగుతోందన్నారు. దీనికి అదనంగా ఇటీవలే భీంగల్ మండలంలోని దేవక్కపేట్, కారేపల్లి గ్రామాల్లో 1700 పైచిలుకు ఎకరాల అసైన్డ్ భూమిని సైతం లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. పోడు భూములపై హక్కులు కల్పించిన నేపథ్యంలో గిరిజనులు ఇకపై చెట్ల నరికివేతకు స్వస్తి పలకాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. అడవుల సంరక్షణ ధ్యేయంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగితేనే ప్రకృతి అనుకూలించి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తద్వారా సమృద్ధిగా పంటలు పండించుకోగలుగుతామని అన్నారు. గిరిజనులు ఎంతో ఇష్టంగా జరుపుకునే తీజ్ వేడుకను దృష్టిలో పెట్టుకొని ప్రతి తండాలో తీజ్ భవన్ ఏర్పాటు చేయాల్సిందిగా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవిస్తానని హామీ ఇచ్చారు.

గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. తండాలకు గ్రామ పంచాయతీల హోదా కల్పించడంతో గిరిజనులకు స్థానిక సంస్థల్లో స్వయంపాలన దక్కిందని గుర్తు చేశారు. మారుమూల అటవీ ప్రాంతాల్లోని తండాలకు సైతం రోడ్లు, విద్యుత్, తాగునీటి వసతి వంటి సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని అన్నారు. తాటిపల్లి – మర్రిమడ్ల రోడ్డు నిర్మాణానికి అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ, వాటిని అధిగమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో బీటీ రోడ్డును మంజూరు చేయించానని తెలిపారు. రహత్ నగర్ నుంచి కారేపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి సైతం నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి ప్రకటించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లాలో అర్హులైన 4300 మందికి 8600 ఎకరాల పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ తదితర వివరాలను సేకరించి ప్రస్తుత సీజన్ నుండే వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా భీంగల్ మండల రైతాంగానికి కోటి 38 లక్షల రూపాయల రైతుబంధు పెట్టుబడి జమ అయ్యిందని వివరించారు.

సాంకేతికంగా నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించి దేవక్కపేట, మానాల ప్రాంత రైతులకు సంబంధించిన పోడు భూముల పట్టాలను కూడా మరో రెండు మూడు రోజుల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ క్షేత్రస్థాయిలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే అర్హులైన వారికి పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి విస్తృత ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. అడవిని తల్లిగా భావించే గిరిజనులు చెట్లు నరకడానికి స్వస్తి చెప్పి, అటవీ ప్రాంతాన్ని సంరక్షించాలని కోరారు. పట్టాలు అందుకున్న రైతులు పోడు భూముల్లో ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు సాగు చేసుకోవచ్చని భరోసా కల్పించారు. వారి భూములకు సాగునీటి వసతి కల్పన కోసం జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ సాంప్రదాయ పద్ధతుల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డిఓ రవి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగురావ్, భీంగల్ ఎంపీపీ మహేష్, జెడ్ పి టి సి చౌటుపల్లి రవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శర్మ నాయక్, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రునాయక్, జెడ్పి కో ఆప్షన్ మొయిజ్, సర్పంచ్ చంద్రకళ, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో గిరిజనులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

బీ.టీ రోడ్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపనలు

రూ. 2.25 కోట్లతో భీంగల్ నుండి ముచ్కూర్ వరకు బీ.టీ రోడ్(వయా పురానిపేట్,పల్లికొండ) పునరుద్ధరణ పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం పురాణీపెట్, పల్లికొండ గ్రామాలలో శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు విన్నవించిన సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News