Vijayashanti: తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ తల్లి రూపంపై బీఆర్ఎస్ నేతలకు కొట్లాడే హక్కు లేదంటూ సూచించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
‘2007 సంవత్సరంలో తల్లి తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో మొదటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. బడుగు, బలహీన, సబ్బండ వర్గాల తల్లి ప్రతిరూపంగా బీఎస్ రాములు చిత్రీకరించారు. అప్పటికి నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనే చేయలేదు. అంతేకాడు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ అధికారికంగా తెలంగాణ తల్లి రూపానికి హోదా, గౌరవం, నిర్దేశ విధానాలు కల్పించలేదు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లిని మార్చిందని కొట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదు. బీఆర్ఎస్ వంటి రాజకీయ పార్టీ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి రూపం మార్పుపై ఆ పార్టీ కొట్లాడితే….. ఆ హక్కు వారికి ఎక్కడున్నది?. తల్లి తెలంగాణ విగ్రహ రూపాన్ని బిఆర్ఎస్ మార్చిందని నాటి మన తెలంగాణా ఉద్యమకారులు కూడా కొట్లాడవచ్చు. మన బోనాలు, బతుకమ్మ సంస్కృతి తరతరాలుగా నిలిచే ఉన్నవి, ఉంటవి. వాటిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు’ అంటూ ఆమె సూచించారు.