Kakatiya era stepwell restoration : ఒకప్పుడు రాణి రుద్రమదేవి జలకాలాడిన ఆ చారిత్రక సౌధం.. కాలగర్భంలో కలిసిపోయి, శిథిలావస్థకు చేరింది. కానీ, నేడు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుని, కాకతీయ శిల్పకళా చాతుర్యానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. వరంగల్ నగరంలోని ఆ చారిత్రాత్మక మెట్లబావి, పునరుద్ధరణ పనుల అనంతరం సోమవారం తిరిగి ప్రారంభమై, పర్యాటకులను, చరిత్ర ప్రియులను ఆకట్టుకుంటోంది. అసలు ఈ బావి ప్రత్యేకతలేంటి? దీని పునరుద్ధరణ పనులు ఎలా సాగాయి?
వరంగల్ ఫోర్టు రోడ్డు, శివనగర్‌లో ఉన్న ఈ మెట్లబావిని, కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి స్నానం చేసేందుకు ప్రత్యేకంగా నిర్మించారని ప్రతీతి. కాకతీయ కోట నుంచి ఈ బావికి సొరంగ మార్గం ఉండేదని, రాణి ఆ మార్గం గుండానే ఇక్కడికి వచ్చేవారని స్థానికులు చెబుతారు. అయితే, కాలక్రమేణా సరైన నిర్వహణ లేక, ఈ అద్భుత కట్టడం కనుమరుగయ్యే స్థితికి చేరింది.
పునరుద్ధరణకు శ్రీకారం : ఈ చారిత్రక సంపదను కాపాడే లక్ష్యంతో, ప్రభుత్వం ఏడాదిన్నర కిందట పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టింది.
రూ.49 లక్షల నిధులు: సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలోని మెట్లబావిని అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థకే, రూ.49 లక్షల నిధులతో ఈ పనులను అప్పగించారు.
సంప్రదాయ పద్ధతులతో మరమ్మతులు: గతంలో జరిగిన అభివృద్ధి పనుల వల్ల బావికి పగుళ్లు రావడంతో, నిపుణులు వాటిని సంప్రదాయ పద్ధతుల్లో సరిదిద్దారు. బావి చుట్టూ ఉన్న ఆధునిక నిర్మాణాలను తొలగించి, దాని బరువుకు తగినట్లుగా ‘డంగు సున్నం’ వంటి మిశ్రమాలను వాడారు.
కరక్కాయ, బెల్లంతో పూతలు: పగుళ్లను, కరక్కాయ, బెల్లం, సున్నంతో తయారు చేసిన ప్రత్యేక మిశ్రమంతో పూడ్చి, బావికి పూర్వపు పటుత్వాన్ని అందించారు..
కొత్త అందాలతో కళకళ : పునరుద్ధరణ పనులతో, మెట్లబావి ఇప్పుడు కొత్త అందాలను సంతరించుకుంది. బావి చుట్టూ ఉన్న ప్రహరీని తొలగించి, స్టీల్ రాడ్లతో సుందరీకరించారు. దీనివల్ల, బయటి నుంచి కూడా బావి అందాలను వీక్షించవచ్చు. లోపల దీపాలను ఏర్పాటు చేయడం, సందర్శకులు కూర్చోవడానికి కుర్చీలను అమర్చడంతో, ఈ ప్రాంతమంతా ఓ పర్యాటక శోభను సంతరించుకుంది. సోమవారం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ పునరుద్ధరించిన మెట్లబావిని అధికారికంగా ప్రారంభించారు. ఈ చారిత్రక కట్టడం, వరంగల్ పర్యాటకంలో ఓ కొత్త ఆకర్షణగా నిలవనుంది.


