Saturday, November 15, 2025
HomeతెలంగాణMamunuru airport : మామునూరు ఎయిర్‌పోర్ట్: రెక్కలు వస్తున్న వేళ.. నిర్వాసితుల కన్నీళ్లు!

Mamunuru airport : మామునూరు ఎయిర్‌పోర్ట్: రెక్కలు వస్తున్న వేళ.. నిర్వాసితుల కన్నీళ్లు!

Mamunuru airport land acquisition : ఓరుగల్లు గగనతలంలో మళ్లీ విమానాలు చక్కర్లు కొట్టనున్నాయి. దశాబ్దాలుగా మూతపడిన మామునూరు విమానాశ్రయానికి పునరుజ్జీవం పోసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇది వరంగల్ అభివృద్ధికి ‘గేమ్ ఛేంజర్’ కానుందనడంలో సందేహం లేదు. కానీ, ఈ అభివృద్ధి రెక్కల కింద, కొన్ని బతుకులు ఛిద్రమవుతున్నాయి. భూములు, ఇళ్లు కోల్పోయి, ఉపాధికి దూరమై, “ఊరు వదిలి ఎలా బతకాలి…?” అంటూ నిర్వాసితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అసలు వారి డిమాండ్లేంటి? ప్రభుత్వం ఇస్తున్న హామీలేంటి..?

- Advertisement -

అసలేం జరిగిందంటే : నిజాం కాలంలో సేవలందించిన మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించేందుకు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కు అదనంగా మరో 253 ఎకరాల భూమి అవసరమైంది. ఈ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లను విడుదల చేసింది. ఈ ప్రక్రియలో, ఖిలా వరంగల్ మండలంలోని గాడెపల్లి, నక్కలపల్లి, గుంటూరుపల్లి గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు. ముఖ్యంగా, గాడెపల్లి గ్రామంలో 12 ఇళ్లకు చెందిన 20 కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయులవుతున్నాయి.

నిర్వాసితుల ఆవేదన.. అవేదన : పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటే, తమ బతుకులు రోడ్డున పడతాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విమానాశ్రయం కోసం మా భూములు, ఇళ్లు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ, మా ఉపాధి సంగతేంటి? మేం ఇక్కడే వ్యవసాయం, కుల వృత్తులు చేసుకుని బతుకుతున్నాం. ఈ ఊరు వదిలి వెళితే, మేం ఏం చేసి బతకాలి? మా పిల్లల భవిష్యత్తేంటి?”
– కత్తెరపల్లి రామరాజు, స్థానికుడు, గాడెపల్లి

తమకు కేవలం డబ్బు పరిహారం కాదని, ఊరికి సమీపంలోనే ఇళ్లు కట్టించి, మౌలిక వసతులు కల్పిస్తే, ఇక్కడే ఉంటూ తమ వృత్తులు చేసుకుని బతుకుతామని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని వారు మంత్రి కొండా సురేఖ దృష్టికి కూడా తీసుకెళ్లారు.

ప్రభుత్వం ఇస్తున్న హామీలు : నిర్వాసితులతో జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు.

ఇంటి స్థలాలకు గజానికి రూ.5,500 చొప్పున పరిహారం.
ఇంటి నిర్మాణ పరిస్థితిని బట్టి అదనపు పరిహారం.
లేదా, ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు.

అయితే, ఈ ప్రతిపాదనలకు నిర్వాసితులు పూర్తిగా అంగీకరించడం లేదు. తమ ఉపాధికి భరోసా కల్పించాలని, ఊరికి దగ్గరలోనే పునరావాసం చూపాలని వారు గట్టిగా కోరుతున్నారు.
అభివృద్ధి అవసరమే, కానీ ఆ అభివృద్ధిలో భాగస్వాములై, సర్వం కోల్పోతున్న నిర్వాసితుల బతుకులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది. ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభించి, త్వరలోనే మామునూరు నుంచి విమానం ఎగరాలని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad