Child safety and POCSO awareness : అభం శుభం తెలియని పసిమొగ్గల బాల్యంపై కామాంధులు పడగ విప్పుతున్నారు. చట్టాలు కఠినంగా ఉన్నా, శిక్షలు పడుతున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే, ఈ నేరాలకు పాల్పడుతున్న వారిలో అధికశాతం తెలిసినవాళ్లు, బంధువులే ఉండటం. ఈ పెనుభూతాన్ని తరిమికొట్టాలంటే కేవలం చట్టాలు సరిపోవు.
నమ్మకద్రోహమే అధికం : చిన్నారులపై జరిగే లైంగిక దాడుల కేసులను విశ్లేషిస్తే, అత్యంత దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ దాడులకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం పరిచయస్తులు, కుటుంబ స్నేహితులు, బంధువులే ఉంటున్నారు. తమ పైశాచిక వాంఛ తీర్చుకున్న తర్వాత, విషయం బయటకు పొక్కుతుందనే భయంతో ఆ పసి ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ తరహా ఘటనలను నివారించాలంటే, ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యత పెరగాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు పిల్లలకు భద్రతా పాఠాలు నేర్పడంలో కీలక పాత్ర పోషించాలి.
జిల్లాలో కలవరపరిచిన ఘటనలు : గత మే నెలలో హనుమకొండ చింతగట్టు సమీపంలో, ఓ ఫుడ్ డెలివరీ బాయ్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ చిన్నారి భయపడకుండా ధైర్యంగా విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.
నాలుగు నెలల క్రితం సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో, అద్దె ఇంట్లో నివాసముంటున్న ఓ యువకుడు పక్కింటి బాలికను మాయమాటలతో లోబరుచుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ రెండు ఘటనల్లోనూ బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడం వల్లే నిందితులకు శిక్ష పడింది. ఇది ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
పోక్సో చట్టం కింద కఠిన చర్యలు: అదనపు డీసీపీ : “18 ఏళ్లలోపు పిల్లలపై ఎలాంటి లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడినా పోక్సో చట్టం కింద కఠినమైన చర్యలు తప్పవు,” అని వరంగల్ క్రైం అదనపు డీసీపీ బాలస్వామి హెచ్చరించారు. “తల్లిదండ్రులు పిల్లలకు అనవసరమైన స్వేచ్ఛ ఇవ్వకూడదు. ముఖ్యంగా వారికి ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’పై స్పష్టమైన అవగాహన కల్పించాలి. పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారనే విషయాలపై ఓ కన్నేసి ఉంచాలి. వీలైనంత వరకు పిల్లలను ఒంటరిగా ఉంచవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే నానమ్మ, అమ్మమ్మ, అత్త వంటి నమ్మకమైన వారి వద్ద మాత్రమే వదిలి వెళ్లాలి,” అని ఆయన సూచించారు.
తల్లిదండ్రులే తొలి రక్షణ కవచం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పోలీసులు, చట్టాలు తమపని తాము చేసుకుపోయినా, పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులదే అంతిమ బాధ్యత. ప్రతి తల్లిదండ్రులు తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
అవగాహన కల్పించండి: పిల్లల వయసుకు తగినట్లుగా, వారికి అర్థమయ్యే భాషలో ‘గుడ్ టచ్’, ‘బ్యాడ్ టచ్’ గురించి వివరించాలి. శరీరంలోని ప్రైవేట్ భాగాల గురించి, వాటిని ఎవరూ తాకకూడదని స్పష్టంగా చెప్పాలి.
ఒంటరిగా వదలొద్దు: చిన్న పిల్లలను ఇంట్లో గానీ, బయట గానీ ఒంటరిగా వదిలి వెళ్లకూడదు. నమ్మకమైన పెద్దల పర్యవేక్షణలోనే ఉంచాలి.
స్నేహంగా మెలగండి: పిల్లలతో రోజూ కొంత సమయం గడపాలి. స్నేహితుల్లా మాట్లాడితే, వారు తమకు ఎదురైన ఎలాంటి ఇబ్బందినైనా భయపడకుండా మీతో పంచుకుంటారు.
ధైర్యం నూరిపోయండి: ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే, వెంటనే గట్టిగా అరవాలని, ఆ ప్రదేశం నుంచి దూరంగా పరిగెత్తి రావాలని, విషయాన్ని వెంటనే తల్లిదండ్రులకు లేదా నమ్మకమైన పెద్దలకు చెప్పాలని ధైర్యం నూరిపోయాలి.


