Warangal’s national-level sports family : ఆ ఇంట్లో అడుగుపెడితే.. పతకాలు పలకరిస్తాయి, ట్రోఫీలు స్వాగతం పలుకుతాయి. ఎందుకంటే, ఆ కుటుంబంలోని నలుగురూ జాతీయ స్థాయి క్రీడాకారులే! భర్త ప్రోత్సాహంతో భార్య, తల్లిదండ్రుల స్ఫూర్తితో పిల్లలు.. ఇలా అందరూ బాల్ బ్యాడ్మింటన్‌లో రాణిస్తూ, క్రీడలనే తమ ఇంటిపేరుగా మార్చుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన జూల రమేశ్ కుటుంబం, నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ అరుదైన క్రీడా ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
పుట్టినిల్లుగా శాయంపేట హవేలీ : వరంగల్ జిల్లా, గీసుకొండ మండలం, శాయంపేట హవేలీ గ్రామం, మూడు దశాబ్దాల క్రితం బాల్ బ్యాడ్మింటన్‌కు పుట్టినిల్లుగా ఉండేది. ఆ ఊరి మట్టిలోనే పుట్టిపెరిగిన జూల రమేశ్, చిన్నతనం నుంచే ఈ ఆటపై మక్కువ పెంచుకున్నారు.
రమేశ్ ప్రస్థానం: పాఠశాల స్థాయి నుంచే పదిసార్లు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని, కాకతీయ యూనివర్సిటీకి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 20 ఏళ్ల పాటు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఎందరో క్రీడాకారులను తీర్చిదిద్దారు.
భార్యను తీర్చిదిద్ది : 1993లో మంచిర్యాలకు చెందిన విజయలక్ష్మిని వివాహం చేసుకున్నాక, రమేశ్ తన క్రీడాస్ఫూర్తిని ఆమెకూ పంచారు.
విజయలక్ష్మికి శిక్షణ: పెళ్లికి ముందు వాలీబాల్, ఖోఖో, కబడ్డీలో రాష్ట్ర స్థాయి క్రీడాకారిణి అయిన విజయలక్ష్మికి, రమేశ్ బాల్ బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇచ్చారు.
రాష్ట్ర స్థాయిలో రాణింపు: భర్త ప్రోత్సాహంతో, విజయలక్ష్మి ఐదుసార్లు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని సత్తా చాటారు. ప్రస్తుతం ఆమె ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
తల్లిదండ్రుల బాటలోనే పిల్లలు : తల్లిదండ్రుల స్ఫూర్తితో, వారి ఇద్దరు పిల్లలు అరవింద్, శ్రీనిధి కూడా చిన్నతనం నుంచే బాల్ బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్నారు.
కుమారుడు అరవింద్ (27): రెండుసార్లు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు. బీటెక్ పూర్తి చేసి, ప్రస్తుతం కాజీపేటలో రైల్వే అసిస్టెంట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
కుమార్తె శ్రీనిధి (25): ఏడుసార్లు రాష్ట్ర స్థాయి, నాలుగుసార్లు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని పతకాలు సాధించింది. డెంటల్ విద్యను పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఒకవైపు చదువు, ఉద్యోగాలలో రాణిస్తూనే, మరోవైపు క్రీడలలోనూ జాతీయ స్థాయిలో తమదైన ముద్ర వేస్తున్న ఈ ‘క్రీడా కుటుంబం’, నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.


