ములుగు జిల్లాలో వాజేడు ఎస్సై (Wazedu SI) ఆత్మహత్య వార్త సంచలనంగా మారింది. ఓ రిసార్ట్స్ లో వాజేడు మండలం ఎస్సై రుద్రారపు సతీష్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సూసైడ్ కి పాల్పడ్డాడు. కాగా, సతీష్ ఆదివారం ఉదయం పూసూరు గోదావరి బ్రిడ్జ్ సమీపంలోని ఫెరిడో రిసార్ట్స్ కి ఒంటరిగా వెళ్ళాడు. రాత్రి అయినా స్టేషన్ కి తిరిగి రాలేదు. వేచి చూసిన స్టేషన్ సిబ్బంది సోమవారం ఉదయం రిసార్ట్స్ కు వెళ్లి ఆరా తీశారు. సతీష్ అక్కడే ఉన్నాడని తెలిసి.. పోలీసులు అతను అద్దెకి తీసుకున్న గదికి వెళ్లి చూశారు. ఆ గదిలో రక్తపు మడుగులో ఉన్న సతీష్ ని చూసి వారంతా షాక్ అయ్యారు. దీంతో వాజేడు పోలీస్ స్టేషన్ సిబ్బంది అధికారులకు సమాచారం అందించి, ఎస్ఐ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, వాజేడు ఎస్సై ఆత్మహత్య (Wazedu SI Suicide) లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరు గ్రామస్థులను గొడ్డలితో నరికి చంపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులోనే ఒత్తిడి తట్టుకోలేక ఎస్సై సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు, ప్రేమ-పెళ్లి వ్యవహారమే ఎస్సై ఆత్మహత్యకి ప్రధాన కారణం అయుండొచ్చని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండడంతో మనస్థాపానికి గురై ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఆదివారం రాత్రి సతీష్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి రిసార్ట్ కి వెళ్ళినట్లు సమాచారం.