Bay of Bengal cyclone formation : ఏటా క్యాలెండర్ లో అక్టోబర్, నవంబర్ నెలలు వస్తున్నాయంటే చాలు, తెలుగు రాష్ట్రాల తీర ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కంటి మీద కునుకు కరువవుతుంది. ఎందుకంటే, ఏటికేడాది బంగాళాఖాతంలో ఏర్పడే తీవ్ర తుపానులు అత్యధికంగా ఈ రెండు నెలల్లోనే విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇటీవల ‘మొంథా’ తుపాను సృష్టించిన బీభత్సం మరువక ముందే, మరో అల్పపీడనం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అసలు మిగతా పది నెలల కన్నా ఈ రెండు నెలల్లోనే తుపానుల ఉధృతి ఎందుకు ఎక్కువగా ఉంటోంది? సముద్ర గర్భంలో జరిగే ఆ శాస్త్రీయ ప్రక్రియ ఏమిటి..? వాతావరణ నిపుణులు అందిస్తున్న విశ్లేషణ ఏమిటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ ప్రత్యేక కథనం.
గణాంకాలే చెబుతున్న నిజం : గడిచిన ఐదు దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే, ఈ రెండు నెలల ప్రమాద తీవ్రత స్పష్టంగా అర్థమవుతుంది. భారత వాతావరణ శాఖ (IMD) గణాంకాల ప్రకారం, 1970 నుంచి 2025 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని 31 తీవ్ర తుపానులు తాకాయి. ఆశ్చర్యకరంగా, వీటిలో ఏకంగా 23 తుపానులు అక్టోబర్ (9), నవంబర్ (14) నెలల్లోనే సంభవించాయి. అంటే దాదాపు 75% తీవ్ర తుపానులు ఈ 60 రోజుల కాలంలోనే తీరం దాటాయి. ఇది యాదృచ్ఛికం కాదు, దీని వెనుక కచ్చితమైన శాస్త్రీయ కారణాలున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అసలు కారణాలేంటి? నిపుణుల విశ్లేషణ : తుపాను ఏర్పడాలంటే అల్పపీడనం, వాయుగుండం వంటి దశలు దాటాలి. అయితే అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఏర్పడే అల్పపీడనాలు అత్యంత వేగంగా బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపానులుగా ఎందుకు మారుతున్నాయో ఐఎండీ శాస్త్రవేత్త శ్రావణి ఇలా వివరిస్తున్నారు.
సముద్ర ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసాలు: జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తాయి. ముఖ్యంగా హిమాలయాల్లో పుట్టే గంగ, బ్రహ్మపుత్ర వంటి జీవనదుల నుంచి లక్షల క్యూసెక్కుల స్వచ్ఛమైన నీరు బంగాళాఖాతంలోకి వచ్చి చేరుతుంది. ఈ మంచినీరు, సముద్రపు ఉప్పునీటితో కలవడం వల్ల సాంద్రత, ఉష్ణోగ్రతలలో భారీ తేడాలు ఏర్పడతాయి. ఈ అసమతుల్యతే అల్పపీడనాలు ఏర్పడటానికి, అవి వేగంగా బలపడటానికి ప్రధాన కారణమవుతుంది.
రుతుపవనాల మార్పిడి (Transition Period): సెప్టెంబర్ మూడో వారం నుంచి నైరుతి రుతుపవనాలు క్రమంగా బలహీనపడి దేశం నుంచి నిష్క్రమిస్తాయి. అదే సమయంలో, అక్టోబర్ రెండో వారం నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ మార్పు సమయంలో వాతావరణంలో, ముఖ్యంగా తూర్పు గాలుల్లో తీవ్ర అస్థిరత నెలకొంటుంది. ఈ అస్థిర పరిస్థితులు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలకు మరింత శక్తిని అందించి, వాటిని పెను తుపానులుగా మార్చేందుకు దోహదపడతాయి.
ప్రపంచ వాతావరణ ప్రభావం: కేవలం బంగాళాఖాతంలోని పరిస్థితులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇతర మహాసముద్రాల్లోని వాతావరణం కూడా ఇక్కడి తుపానులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల మధ్య ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంపై గాలుల్లో ఏర్పడే అస్థిరత ప్రభావం హిందూ మహాసముద్రం, తద్వారా బంగాళాఖాతంపై పడుతుంది. ఈ ప్రపంచ అనుసంధాన ప్రక్రియ కూడా ఈ కాలంలోనే తుపానుల తీవ్రతను పెంచుతోంది.
ఈ మూడు ప్రధాన కారణాల వల్ల అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగాళాఖాతం ఒక “తుపానుల పురిటిగడ్డ”గా మారుతుంది. ఇక్కడ ఏర్పడే అల్పపీడనాలు కేవలం వాయుగుండాలుగా మిగిలిపోకుండా, పెనుగాలులు, కుంభవృష్టితో కూడిన తీవ్ర తుపానులుగా రూపాంతరం చెంది తీర ప్రాంతాలపై విరుచుకుపడి అపార ఆస్తి, పంట నష్టాన్ని మిగులుస్తున్నాయి.


