తెలంగాణలో మందుబాబులకు శుభవార్త. మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూఇయర్(New Year) వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న అర్థరాత్రి వరకు వైన్ షాపులకు(Wine Shops) ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అర్థరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులకు.. బార్లు, రెస్టారెంట్లకు 1 గంట వరకు పర్మిషన్ ఇచ్చింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలో నిర్వహించే స్పెషల్ ఈవెంట్లకు పలు షరతులతో అనుమతినిచ్చింది.
పార్టీలు, పబ్‌లలో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించింది. అలాగే డిసెంబర్ 31 రాత్రి నిర్వహించే ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వైన్ షాపులు అర్ధరాత్రి దాకా తెరిచేందుకు అనుమతి ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది. మరోవైపు ప్రభుత్వం నిర్ణయంతో మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.