Sunday, November 16, 2025
HomeతెలంగాణWinter Health Alert:చలి గుప్పిట చిన్నారులు.. పొంచి ఉన్నాయ్ ముప్పులు!

Winter Health Alert:చలి గుప్పిట చిన్నారులు.. పొంచి ఉన్నాయ్ ముప్పులు!

Seasonal illness in children : చలికాలం వచ్చేసింది… కేవలం స్వెటర్లు, మఫ్లర్లనే కాదు, పాటు ఆరోగ్య సమస్యలనూ మోసుకొచ్చింది. వాతావరణంలో మార్పులతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పసిపిల్లలు సులభంగా వ్యాధుల బారిన పడుతున్నారు. మీ పిల్లలను ఈ చలిలో బయటకు తీసుకెళ్తున్నారా? అయితే ఒక్క నిమిషం! ఆసుపత్రికి వచ్చే ప్రతి 10 మంది చిన్నారులలో ఆరుగురు అవే వ్యాధులతో బాధపడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ కాలంలో పిల్లలపై పంజా విసురుతున్న ఆ వ్యాధులేంటి..? వాటి నుంచి మన చిన్నారులను ఎలా కాపాడుకోవాలి..? వైద్యులు ఏం చెబుతున్నారు..?

- Advertisement -

ఆసుపత్రులకు క్యూ కడుతున్న జనం : చలి తీవ్రత పెరుగుతుండటంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మెదక్ జిల్లాలోని ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం 200-300 మంది రోగులు వస్తుండగా, వీరిలో 30-50 మంది చిన్నారులే ఉంటున్నారు. గతంలో రోజుకు 60 మంది వచ్చే చేగుంట పీహెచ్‌సీకి ఇప్పుడు వంద మంది వరకు వస్తుండటమే ఇందుకు నిదర్శనం. పాపన్నపేట, పొడ్చన్‌పల్లి, శివ్వంపేట ఆరోగ్య కేంద్రాలలోనూ జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

చిన్నారులపై చలి పంజా.. ప్రధానంగా ఈ వ్యాధులే : పెద్దలతో పోలిస్తే పిల్లలపై చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వైద్యుల ప్రకారం, ప్రస్తుతం మూడు రకాల సమస్యలు చిన్నారులను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి.
చర్మ వ్యాధులు: చలికి పిల్లల సున్నితమైన చర్మం పొడిబారిపోతోంది. దీనివల్ల దురద, దద్దుర్లు, ఇతర చర్మ సంబంధిత వ్యాధులు అధికంగా కనిపిస్తున్నాయి. డీహైడ్రేషన్ కూడా ఇందుకు ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు.
శ్వాసకోశ సమస్యలు: జలుబు, దగ్గు, గొంతునొప్పి సర్వసాధారణమయ్యాయి. ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్నారులు నిమోనియా వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అలర్జీల ఉధృతి: వాతావరణ మార్పులతో పిల్లలలో అలర్జీలు పెరిగాయి. ముఖ్యంగా అలర్జిక్ రైనైటిస్ (ముక్కు కారడం, తుమ్ములు), బ్రాంకైటిస్ (ఆయాసం) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చే ప్రతి 10 మందిలో 5-6 మంది పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

“చలికాలం ఆరంభమైనందున తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులను చల్లని ప్రదేశాల్లో తిప్పరాదు. గోరువెచ్చని నీటిని, ఆహారాన్ని ఇవ్వాలి. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ క్రీములు తప్పనిసరిగా రాయాలి. డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి.”
– డాక్టర్ సూరినేని చంద్రశేఖర్, పిల్లల వైద్య నిపుణులు, మెదక్‌

జిల్లాలో వైద్య ఆరోగ్య చిత్రం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: 21
పల్లె, బస్తీ దవాఖానాలు: 100
అక్టోబర్ నెలలో చికిత్స పొందిన రోగులు: 32,390

ఈ గణాంకాలు వ్యాధుల తీవ్రతకు అద్దం పడుతున్నాయి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా తీవ్రమైన ముప్పుల నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad