Woman Fight for Free Ticket in Deluxe Bus: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చాక ఎంతో మంది మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మాత్రమే ఉండగా.. డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి వంటి ఇతర ప్రభుత్వ రవాణా బస్సుల్లో డబ్బులిచ్చి టికెట్ కొనుక్కోవాల్సిందే. కానీ ఇక్కడ ఓ మహిళ మాత్రం తనకు డీలక్స్ బస్సులో కూడా ఫ్రీ టికెట్ కావాలంటూ నడిరోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చుని హల్‌చల్ చేసింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/tpcc-chief-mahesh-goud-slams-etela-bandi-on-bc-issues/
ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం తీసుకొచ్చాక.. బస్సులు విపరీతంగా రద్దీగా ఉంటున్నాయి. ఇక పండుగ సమయాల్లో ఆ రద్దీ చెప్పతరం కాదు. సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం లాంటి ఘటనలు వైరలయ్యాయి. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఈ పథకంతో ఎంతో మంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోగలగుతున్నారు. అయితే దసరా పండుగ సమయంలో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రద్దీ తాళలేకనో, మరే కారణంగానో ఓ మహిళ మాత్రం తనకు డీలక్స్ బస్సులో టికెట్ కావాలని డిమాండ్ చేసింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/hyderabad-meat-shops-close-in-october-2nd-gandhi-jayanti/
మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సులో కొత్తగూడెం వద్ద ఎక్కిన ఓ మహిళ.. ఫ్రీ టికెట్ ఇవ్వాలని ఆధార్ చూపిస్తూ కండక్టర్‌ను కోరింది. అయితే ఆ కండక్టర్ ఈ బస్సులో ఆధార్ చెల్లదని చెప్పినా ఆ మహిళ వినిపించుకోకపోగా కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. అనంతరం రోడ్డుపై బస్సుకి అడ్డంగా కూర్చుని రోదించింది.
మహిళా ప్రయాణికురాలు బస్సుకు అడ్డంగా కూర్చోవడంతో.. కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఎంతమంది నచ్చజెప్పినా ఆమె వినిపించుకోలేదు. మహిళ తీరుకు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలువురు వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మహిళ తీరు పట్ల పలువురు ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని.. మహిళకు నచ్చజెప్పి పంపించేశారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.


