Missing women cases in Telangana : తరాలు మారినా ఆడపిల్లల తలరాతలు మారడం లేదు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, వివక్ష అనే మహమ్మారి ఏదో ఒక రూపంలో వారిని వెంటాడుతూనే ఉంది. సొంతింటి నుంచి సమాజం వరకు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇవన్నీ చాలవన్నట్లు, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహిళల అదృశ్యం కేసులు పెరిగిపోవడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాతీయ నేర గణాంకాలు ఆందోళనకరమైన వాస్తవాలను కళ్లముందుంచుతున్నాయి.
ఇంట్లో నుంచి బయటకు వెళ్లినవారు తిరిగి రాకపోవడం, వారి ఆచూకీ లభించకపోవడం వంటి ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్వసాధారణంగా మారుతున్నాయి. ఏటా వేల సంఖ్యలో నమోదవుతున్న అదృశ్యం కేసుల్లో అధిక శాతం మహిళలవే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొన్ని కేసులను పోలీసులు ఛేదిస్తున్నా, చాలా మంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. దీనికి తోడు మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) ముఠాలు మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి జీవితాలను చిదిమేస్తున్నాయనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
గణాంకాలు చెబుతున్న నిజాలు: కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ నేర గణాంక విభాగం (NCRB) విడుదల చేసిన వివరాల ప్రకారం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళల అదృశ్యంలో రాష్ట్రంలోనే ఆందోళనకరమైన స్థాయిలో ఉంది.
2023లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 962 మంది మహిళలు అదృశ్యమయ్యారు. మొత్తం 1,230 అదృశ్యం కేసులు నమోదు కాగా, అందులో మహిళల సంఖ్యే అధికం. 2022లో ఈ సంఖ్య 1,175గా ఉంది. ఏటా వందల సంఖ్యలో మహిళలు కనిపించకుండా పోతుండటం గమనార్హం.
అదృశ్యమవుతున్న వారిలో కేవలం మహిళలే కాకుండా, 14 ఏళ్లలోపు చిన్నారులు, 18 ఏళ్లలోపు యువతులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉంటున్నారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే (2023)..
కరీంనగర్: మొత్తం 395 మంది అదృశ్యం కాగా, వారిలో 303 మంది మహిళలే ఉన్నారు.
పెద్దపల్లి: నమోదైన 303 మిస్సింగ్ కేసుల్లో, బాధితుల్లో 232 మంది మహిళలు.
జగిత్యాల: 354 అదృశ్యం కేసుల్లో, 294 మంది మహిళలు కావడం ఆందోళన కలిగిస్తోంది.
సిరిసిల్ల: 178 మంది అదృశ్యమవగా, వారిలో 133 మంది మహిళలే ఉన్నారు.
ఈ లెక్కలు స్పష్టంగా చెబుతున్నది ఒక్కటే. ఉమ్మడి జిల్లాలో నమోదవుతున్న ప్రతి నాలుగు అదృశ్యం కేసుల్లో, మూడు మహిళలకు సంబంధించినవే ఉంటున్నాయి. కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు, చదువులో ఒత్తిడి వంటి కారణాలు కొన్ని సందర్భాల్లో ఉన్నప్పటికీ, పెద్ద ఎత్తున మహిళలు అదృశ్యం కావడం వెనుక బలమైన కారణాలు, వ్యవస్థీకృత నేరాల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


