Female Radio Jockeys of All India Radio Adilabad : “ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్‌ఎంకు స్వాగతం…” అంటూ ఉదయాన్నే వినిపించే ఆ మధురమైన స్వరం వెనుక ఎన్నో కథలున్నాయి. శ్రోతల హృదయాలను తమ మాటలతో కట్టిపడేస్తున్న ఆ గొంతుకలు ఉన్నత విద్యావంతులైన అతివలవి. భాషణమే ఆభరణంగా, ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చేసుకొని వ్యాఖ్యాన రంగంలో రాణిస్తున్న ఈ మహిళా రేడియో జాకీలు (ఆర్జేలు) ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రానికి కొత్త కళను తీసుకొచ్చారు. ఒకప్పుడు నలుగురిలో మాట్లాడాలంటేనే భయపడిన వారు, నేడు తమ గళాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా మధుర స్వరాల రాణులు..? వారి ప్రస్థానం ఎలా మొదలైంది..?
గళమే బలం.. ప్రోత్సాహమే ఇంధనం : ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రంలో మొత్తం 20 మంది ఆర్జేలు పనిచేస్తుంటే, వారిలో 15 మంది మహిళలే ఉండటం విశేషం. ఉన్నత చదువులు చదివి, గృహిణులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తమ అభిరుచిని వృత్తిగా మలచుకున్నారు. కేంద్రం ముఖ్య కార్యక్రమ నిర్వహణాధికారులు సమునస్పతి రెడ్డి, రామేశ్వర్ కేంద్రెల ప్రోత్సాహం, సీనియర్ ఆర్జేలు, కుటుంబ సభ్యుల సహకారంతో వీరు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రేడియో రంగం తమ జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిందని వారు సగర్వంగా చెబుతున్నారు.
ధైర్యం నింపిన ఆకాశవాణి – కొర్రి భారతి : “చిన్నప్పుడు పాటల పోటీల్లో పాల్గొనాలన్నా, నలుగురిలో మాట్లాడాలన్నా భయంతో వణికిపోయేదాన్ని. అలాంటి నాకు ఆకాశవాణి ఆత్మవిశ్వాసాన్నిచ్చింది,” అంటారు ఆర్జే భారతి. డిగ్రీ పూర్తిచేసి, ఇద్దరు పిల్లల తల్లిగా ఉన్న ఆమె, తన స్వరమే తన బలమని నమ్మి ఈ రంగంలోకి అడుగుపెట్టారు. సీనియర్ల నుంచి వ్యాఖ్యానంలో మెళకువలు నేర్చుకొని, నేడు శ్రోతలను తన మాటలతో అలరిస్తున్నారు.
యాసతో పలకరిస్తూ.. – బండి అఖిల : “తెలంగాణ మాండలికాలతో, మన యాసలో మాట్లాడటం ఇక్కడే నేర్చుకున్నా. క్రమశిక్షణ, సమయస్ఫూర్తి రేడియో నాకు నేర్పిన గొప్ప పాఠాలు,” అని చెబుతారు బీఈడీ పూర్తి చేసిన అఖిల. కరోనా సమయంలో రాత పరీక్ష, వాయిస్ ఆడిషన్‌లో ఉత్తీర్ణులై ఆర్జేగా ఎంపికైన ఆమె, స్థానిక యాసతో శ్రోతలకు మరింత చేరువయ్యారు.
చిన్ననాటి కల సాకారం – తోట సౌమ్య : “వ్యాఖ్యాన రంగంలో రాణించాలన్నది నా చిన్ననాటి కల. అది ఈ ఆకాశవాణి కేంద్రంలో నెరవేరింది,” అని ఆనందంగా చెబుతారు ఎంఏ చదివిన సౌమ్య. “ఒకసారి అమెరికా నుంచి ఓ శ్రోత ఫోన్ చేసి నా గొంతును ప్రశంసించినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నా గళం విశ్వవ్యాప్తమైందని గర్వంగా అనిపించింది,” అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ మహిళా మణులు కేవలం కార్యక్రమాలను నిర్వహించడమే కాదు, తమ మాటల ద్వారా సమాజంలో స్ఫూర్తిని నింపుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.


