Saturday, November 15, 2025
HomeతెలంగాణHospital Safety : వైద్యశాలల్లో కామాంధులు.. ప్రాణం పోసేచోట పరువు తీస్తున్నారు!

Hospital Safety : వైద్యశాలల్లో కామాంధులు.. ప్రాణం పోసేచోట పరువు తీస్తున్నారు!

Lack of women’s safety and rising harassment cases : “వైద్యో నారాయణో హరి”… ప్రాణం పోసే దేవుళ్లుగా భావించే వైద్యులు, సేవలు అందించే సిబ్బంది ఉండే పవిత్ర స్థలం వైద్యశాల. కానీ, అదే ప్రాంగణంలో కొందరు మానవ మృగాలు కామాంధులుగా మారి, నమ్మకంతో చికిత్స కోసం వచ్చే మహిళల పాలిట యమకింకరులుగా మారుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలే లక్ష్యంగా వారి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఈ అరాచకాలు పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

- Advertisement -

నిబంధనలు గాలికి.. యజమాన్యాల నిర్లక్ష్యం : కరీంనగర్‌లో పుట్టగొడుగుల్లా వెలిసిన 546 ప్రైవేటు ఆసుపత్రులు, 150కి పైగా డయాగ్నస్టిక్ కేంద్రాలు కొన్ని కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి తప్ప, భద్రతా ప్రమాణాలను పట్టించుకోవడం లేదు. నిబంధనలన్నీ నీటిమీద రాతలుగానే మిగిలిపోతున్నాయి.

సిబ్బంది వివరాలు శూన్యం: నియమించుకునే సిబ్బంది పూర్తి వివరాలను, వారి నేపథ్యాన్ని వైద్యారోగ్య శాఖకు తప్పనిసరిగా అందించాలి. కానీ, ఏ ఆసుపత్రి కూడా ఈ నిబంధనను పాటించడం లేదు.

మహిళా రోగులకు పురుష సిబ్బంది: నిబంధనల ప్రకారం, మహిళా రోగిని మహిళా సిబ్బంది మాత్రమే పర్యవేక్షించాలి. కానీ, చాలా ఆసుపత్రుల్లో రాత్రి విధుల్లో పురుష సిబ్బందే మహిళలకు చికిత్స అందిస్తూ, వారికి అదను చూసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
తనిఖీలు ఏవీ?: రాత్రి వేళల్లో సిబ్బంది మద్యం తాగి విధులకు వస్తున్నారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, వారికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించడం లేదు.

మొక్కుబడి తనిఖీలు.. అధికారుల కళ్లుమూతలు:  వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం ఈ అరాచకాలకు మరింత ఆజ్యం పోస్తోంది. గతేడాది ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టినా, అవి కేవలం “తూతూమంత్రంగానే” సాగాయి. ఆ తనిఖీల్లో కేవలం వైద్యుల అర్హతలు, సౌకర్యాలు, అనుమతులపైనే దృష్టి సారించారు తప్ప, రోగుల భద్రత, సిబ్బంది ప్రవర్తన, సేవల నాణ్యత వంటి కీలక అంశాలను గాలికొదిలేశారు. ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే తప్ప ఈ మానవ మృగాలకు భయం పుట్టదు.

వెలుగు చూసిన వెకిలి చేష్టలు.. కరీంనగర్‌లో కలకలం : ఈ నిర్లక్ష్యం ఫలితంగానే కరీంనగర్‌లో ఇటీవలి కాలంలో మనసును కలచివేసే ఘటనలు వెలుగుచూశాయి:
తాజా ఘటన: నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జ్వరంతో చేరిన యువతికి, అక్కడి సిబ్బంది మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటన ఆసుపత్రుల్లో భద్రత ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
రెండు రోజుల క్రితం: ఓ ప్రైవేటు వైద్య కళాశాలలోని మహిళల మూత్రశాలలోకి బురఖా ధరించిన వ్యక్తి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది.

ఏడాదిన్నర కిందట: నగరంలోని పేరొందిన ఓ ఆసుపత్రిలో, మహిళల టాయిలెట్‌లో సెల్‌ఫోన్ పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్న ఓ నీచుడిని రోగుల బంధువులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. బయటకు రానివి, పరువు పోతుందని బాధితులు మౌనంగా భరిస్తున్నవి ఇంకా ఎన్నో ఉన్నాయన్నది వాస్తవం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్లు తెరిచి, అన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది నేపథ్యంపై ఆరా తీసి, భద్రతా ప్రమాణాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే, ప్రాణాలు కాపాడాల్సిన వైద్యశాలలే మహిళల పాలిట కబేళాలుగా మారే ప్రమాదం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad