Agricultural Technology Adoption By Farmers: నాగలి భుజాన వేసుకుని, పశువులను అదిలిస్తూ పొలానికి వెళ్లే రైతు చిత్రం క్రమంగా కనుమరుగవుతోంది. చేతినిండా పని ఉన్నా, చేయడానికి మనుషులు దొరకని విచిత్ర పరిస్థితి నేటి పల్లెల్లో నెలకొంది. ఈ కూలీల కరువును అధిగమించేందుకు అన్నదాతలు ఎంచుకున్న మార్గమేమిటి..? పొలాల్లో డ్రోన్లు, సౌర కంచెలు ఏం చేస్తున్నాయి..? ఆధునిక సాంకేతికతతో సాగు స్వరూపం ఎలా మారిపోతోంది..?
కూలీల కొరత… యాంత్రీకరణకు పునాది: ఒకప్పుడు పల్లె అంటే పచ్చని పైర్లతో పాటు, శ్రామికుల సందడితో కళకళలాడేది. కానీ నేడు పరిస్థితి మారింది. వ్యవసాయ రంగంలో కూలీల కొరత రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది. వ్యవసాయ పనులు చేయడానికి కూలీలు దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ కొరత ఎంతలా ఉందంటే, ఛత్తీస్‌గఢ్, బిహార్, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూలీల బృందాలు వచ్చి ఇక్కడ పనులు చేయాల్సిన పరిస్థితి. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు “యాంత్రీకరణే శరణ్యం” అంటున్నారు. చేతికొచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సాగులో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు.
అరకకు వీడ్కోలు… వీడర్‌కు స్వాగతం: పంటల మధ్య కలుపు తీయడానికి, అంతర కృషి చేయడానికి ఒకప్పుడు అరకలే ఆధారం. కానీ పశుపోషణ భారంగా మారడంతో రైతులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ‘వీడర్లు’ వారి పాలిట వరంగా మారాయి. మార్కెట్లో రూ.30 వేల నుంచి రూ.40 వేల ధరలో లభించే ఈ యంత్రంతో కేవలం లీటరు పెట్రోల్‌తోనే ఎకరం భూమిని కలియదున్నవచ్చు. శ్రమ, సమయం రెండూ ఆదా కావడంతో రైతులు వీటి కొనుగోలుకు అధిక ఆసక్తి చూపుతున్నారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/students-get-three-consecutive-holidays-in-september/
గాల్లో తేలి… చీడపీడలను తరిమి : పంటను పీడించే మరో ప్రధాన సమస్య చీడపీడలు. వాటి నివారణకు వీపున స్ప్రేయర్లు మోస్తూ మందు పిచికారీ చేయడం పాత పద్ధతి. ఇప్పుడు ఆ స్థానంలోకి డ్రోన్లు వచ్చేశాయి. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల పెట్టుబడితో రైతు సంఘాలు, ఔత్సాహికులు వీటిని కొనుగోలు చేసి, సాగుకు కొత్త ఊపునిస్తున్నారు. ఒక డ్రోన్‌తో రోజుకు 30-40 ఎకరాల్లో సులువుగా, సమర్థంగా పిచికారీ చేయవచ్చు. దీంతో రైతుకు సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం “నమో డ్రోన్ దీదీ” పథకం ద్వారా మహిళా సంఘాలకు రాయితీపై డ్రోన్లు అందించేందుకు సన్నాహాలు చేయడం ఈ రంగంలో మరో ముందడుగు.
అడవి జంతువులకు ‘షాక్’… పంటకు రక్షణ కవచం: పండించిన పంట చేతికొచ్చే సమయంలో అడవి పందులు, కోతుల బెడద రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా సౌర కంచెలు, సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. పొలం చుట్టూ ఏర్పాటు చేసే ఈ కంచెల తీగల్లో తేలికపాటి విద్యుత్తు ప్రవహిస్తుంది. ఇది జంతువులకు కేవలం ఒక హెచ్చరికలా పనిచేస్తుందే తప్ప, వాటికి ఎలాంటి హానీ చేయదు. దీంతో పంటకు పూర్తిస్థాయి రక్షణ లభిస్తోంది. వ్యవసాయ క్షేత్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని, దొంగల బారి నుంచి కూడా తమ పరికరాలను, పంటను కాపాడుకుంటున్నారు.
ప్రభుత్వ చేయూత కోసం ఎదురుచూపు: సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా, యంత్రాల కొనుగోలుకు అయ్యే ఖర్చు చాలామంది రైతులకు భారంగా మారుతోంది. ప్రభుత్వం సబ్సిడీపై ట్రాక్టర్లు, వీడర్లు, డ్రోన్లు వంటి యంత్రాలను అందిస్తే, మరింత మంది రైతులు యాంత్రీకరణ వైపు అడుగులు వేస్తారని, తద్వారా వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సాగు గణాంకాలు విస్తీర్ణం (ఎకరాల్లో)
సాగుకు యోగ్యమైన భూమి 6,15,000
ప్రస్తుత సాగు విస్తీర్ణం 4,50,000
మొత్తం రైతుల సంఖ్య 2,28,000
వానాకాలం సాగు అంచనా 2,95,000
ప్రస్తుత సాగు శాతం 68%


