Telangana: ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుండేది. టీడీపీ, కాంగ్రెస్ పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్లుండేది. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా టీడీపీ స్థానానికి టీఆర్ఎస్ ఆక్రమించింది. కానీ, కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఉన్నప్పటికీ పార్టీని బలంగా మార్చే నాయకులే దొరకడం లేదు. అందుకే గ్రేటర్ లో ఒక్కొక్కరు వాళ్ళ రాజకీయ భవిష్యత్ వెతుక్కొని పనిలో పడ్డారు. కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న బీజేపీ వాళ్ళకి గాలమేసి తమ పార్టీలో చేర్చుకుంటుంది.
గ్రేటర్ కాంగ్రెస్ అంటే మనకి గుర్తొచ్చేది పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి.. వీళ్ళని హైదరాబాద్ బ్రదర్స్ అని కూడా పిలిచే వాళ్ళు. వీళ్ళలో మర్రి శశిధర్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ నుండి బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. కాగా.. ఇక పీజేఆర్ లేరు కానీ ఇప్పుడు వాళ్ళ వారసులు రాజకీయాలలో ఉన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ వచ్చీ రాగానే గ్రేటర్ మీద ఫోకస్ పెట్టి పీజేఆర్ కుమార్తెను పార్టీలో చేర్చుకొని.. గ్రేటర్ కాంగ్రెస్ కి ఒక బూస్టప్ ఇవ్వాలని చూశారు. కానీ, కొట్లాటలతో అదేమీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
కాగా.. పీజేఆర్ కుమారుడు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న విషువర్ధన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ వెతుక్కునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీలో ఏ పదవి ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన విష్ణు తాజాగా జరిగిన పీసీసీ కమిటీలలో ఏ పదవి దక్కనుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈలోగా విష్ణుపై బీజేపీ కన్నేసినట్లు తెలుస్తుంది. గ్రేటర్ లో పీజేఆర్ లాంటి బ్రాండ్ తమకి దక్కుతుందంటే బీజేపీ విష్ణును వదులుకునేందుకు సిద్ధంగా లేదు.
అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీపై అలక మీదున్న విష్ణు పీసీసీ పదవి వస్తుందా లేదా చూసి బీజేపీకి వెళతారా లేక అసలు ముందే బీజేపీతో సంప్రదింపులు పూర్తయ్యాయా అన్నది స్పష్టత లేదు. కానీ.. విష్ణు పార్టీ మారడం ఖాయమన్నది మాత్రం గట్టిగా వినిపిస్తుంది. కాగా.. ఇప్పటికే మర్రి శశిధర్ లాంటి నాయకుడిని ఆపడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు విష్ణును కూడా ఆపలేకపోతే గ్రేటర్ ఇంక పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులే లేకుండా పోతారు. మరి కాంగ్రెస్ నష్టనివారణ చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.