Sunday, November 16, 2025
HomeతెలంగాణStudent Crime: సరదాల కోసం అప్పులు.. తీర్చే దారిలో గంజాయి ముప్పు!

Student Crime: సరదాల కోసం అప్పులు.. తీర్చే దారిలో గంజాయి ముప్పు!

Student involvement in drug peddling : కళాశాల మెట్లెక్కాల్సిన కాళ్లు.. కటకటాల వైపు నడుస్తున్నాయి. స్నేహితుల ముందు గొప్పగా కనిపించాలనే తాపత్రయం, క్షణికావేశంలో చేసే అప్పులు కొందరు విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. జల్సాల కోసం లక్షల్లో అప్పులు చేసి, వాటిని తీర్చే మార్గం తెలియక గంజాయి పెడ్లర్లుగా, నేరగాళ్లుగా మారుతున్నారు. అసలు ఈ యువత ఎందుకు ఇలా పెడదారి పడుతోంది? సరదాగా మొదలైన ఈ ప్రయాణం వారిని ఎంతటి ఊబిలోకి నెడుతోంది? పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తున్న విస్తుపోయే నిజాలేంటి?

- Advertisement -

తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీతో సర్దుకుపోవాల్సిన వయసులో, స్నేహితుల మధ్య తమ స్థాయిని చాటుకునేందుకు కొందరు విద్యార్థులు అప్పుల పాలవుతున్నారు. ఖరీదైన పుట్టినరోజు పార్టీలు, బెట్టింగ్‌లు, ప్రియురాళ్లకు బహుమతుల కోసం చేస్తున్న అప్పులు వారిని నేర ప్రపంచంలోకి నెట్టేస్తున్నాయి. అప్పులు తీర్చడానికి సులభమైన మార్గంగా గంజాయి సరఫరాను ఎంచుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఓ ఇంజినీరింగ్ విద్యార్థి కథ : మేడ్చల్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి, రెండేళ్ల క్రితం తన పుట్టినరోజు వేడుకను స్నేహితుల మధ్య ఘనంగా జరిపాడు. ఇందుకోసం ఏకంగా రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చడానికి ముందుగా రుణ యాప్‌లను ఆశ్రయించాడు, ఆ తర్వాత బెట్టింగ్ వైపు మళ్లాడు. కానీ, అప్పులు తీరకపోగా మరింత పెరిగిపోవడంతో, చివరికి గంజాయి సరఫరానే మార్గంగా ఎంచుకున్నాడు. ఓ డ్రగ్ ఏజెంట్ వద్ద ఇతని ఫోన్ నంబర్ లభించడంతో పోలీసులు పట్టుకున్నారు. ఇది కేవలం ఒక్కరి కథ కాదు, ఇలాంటి ఎందరో విద్యార్థులు సరదాల మోజులో పడి తప్పుడు దారులు తొక్కుతున్నారని పోలీసు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్పుల ఊబిలోంచి.. నేరాల వైపు : పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన 120 మందికి పైగా విద్యార్థులను విచారించగా, వారిలో చాలామంది పుట్టినరోజు పార్టీలు, క్రికెట్ బెట్టింగ్‌ల కోసం చేసిన అప్పుల వల్లే ఈ మార్గంలోకి వచ్చినట్లు అంగీకరించారు. కొందరైతే ఏకంగా విశాఖపట్నం, అరకు, ఒడిశా వరకు బైక్‌లపై వెళ్లి గంజాయి తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. మరికొందరు విద్యార్థులు స్నేహితుల లాప్‌టాప్‌లు, ఖరీదైన ఫోన్లను చోరీ చేసే స్థాయికి దిగజారడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఒత్తిడే సాకు.. స్నేహితులే ప్రోత్సాహం : తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) బృందాలు ఇటీవల పలు ప్రైవేట్ యూనివర్సిటీల్లో గంజాయి, సింథటిక్ డ్రగ్స్ తీసుకుంటున్న 70 మందికి పైగా విద్యార్థులను గుర్తించాయి. “యువతీ యువకుల్లో 90 శాతం మంది స్నేహితుల ప్రోత్సాహంతోనే తొలిసారి డ్రగ్స్ రుచి చూశారు,” అని ఈగల్ ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబానికి దూరంగా ఉండటం, తాము ఏం చేసినా ఇంట్లో తెలియదనే ధీమా, చదువు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వారానికోసారి మత్తు తీసుకుంటున్నామని విద్యార్థులు చెప్పడం పోలీసులను విస్మయానికి గురిచేసింది.

మైనర్లతో ఫామ్‌హౌస్‌లో ‘ట్రాప్’ పార్టీ : ఇటీవల మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మైనర్లతో నిర్వహించిన ‘ట్రాప్ హౌస్’ పార్టీ ఈ జాడ్యానికి పరాకాష్టగా నిలిచింది. ఈవెంట్ మేనేజర్‌గా రాణించాలనుకున్న ఓ ఇంటర్ విద్యార్థి, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వారిని ఆహ్వానించి ఈ పార్టీని నిర్వహించాడు. ఒక్కొక్కరి నుంచి రూ.1,600 ఎంట్రీ ఫీజు వసూలు చేసి, విదేశీ మద్యం, గంజాయితో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు దాడి చేసి 62 మందిని పట్టుకోగా, వారిలో 22 మంది మైనర్లు ఉండటం సంచలనం రేపింది. ఈ ఘటనలో నిర్వాహకులు, ఫాంహౌస్ యజమాని సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad