youth suicide crisis in Telangana : కూరలో కారం ఎక్కువైందని ఓ జంట, బైక్ కొనివ్వలేదని ఓ కొడుకు, దేవుడు తన తలరాత సరిగా రాయలేదని మరో యువకుడు.. కారణాలు వేరైనా, ముగింపు మాత్రం ఒకటే. కన్నవారికి కన్నీటిని మిగిల్చి, అనంత లోకాలకు వెళ్లిపోవడం. అమూల్యమైన మానవ జీవితం ఎందుకింత చౌకబారుతోంది? క్షణికావేశంలో తీసుకుంటున్న ఈ తీవ్ర నిర్ణయాల వెనుక ఉన్న సామాజిక, మానసిక కారణాలేంటి? కన్నవారికి కడుపుకోత మిగిల్చే ఈ విషాదాలకు అడ్డుకట్ట వేయడం ఎలా?
చిన్న కారణాలు.. తీరని విషాదాలు : మారుతున్న జీవనశైలి, కుటుంబ బంధాల్లో పెరుగుతున్న అంతరాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. చిన్నపాటి సమస్యకే కుంగిపోయి, జీవితంపై విరక్తి పెంచుకుంటున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన కొన్ని ఘటనలు ఈ చేదు నిజాన్ని కళ్లకు కడుతున్నాయి.
మటన్ కూర చిచ్చు: ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్లు ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి ఒక్కటైన సంతోష్-గంగోత్రిల జీవితం నెల రోజుల్లోనే ముగిసింది. దసరా రోజు అత్తింట్లో వండిన మటన్‌లో కారం ఎక్కువైందని భార్యతో గొడవపడిన సంతోష్, ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు రోజుల్లో ఆత్మహత్య చేసుకుని ప్రేమకు విషాదాంతాన్ని మిగిల్చారు.
శివుడిపై అలిగి : రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రోహిత్, డాక్టర్ కావాలన్న కల నెరవేరలేదన్న మనోవేదనతో కుంగిపోయాడు. “శివా, నా విధిని ఇలా రాస్తావా?” అంటూ శివుడికే లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పరీక్షల వైఫల్యం: హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేయలేకపోయానన్న బాధ, వ్యవసాయంలో వచ్చిన అప్పులు పెద్దపల్లి జిల్లాకు చెందిన అజయ్‌కుమార్‌ను బలితీసుకున్నాయి.
బైక్ కోసం ప్రాణం: వీణవంక మండలంలో పదో తరగతి విద్యార్థి, తండ్రి బైక్ కొనివ్వలేదన్న కోపంతో పురుగుల మందు తాగి తనువు చాలించాడు.
ఎందుకీ నైరాశ్యం? : ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో పెద్దల ఆదరణ, కష్టసుఖాలను పంచుకునే వాతావరణం ఉండేది. నేటి ఆధునిక జీవన విధానంలో తల్లిదండ్రులు ఉరుకుల పరుగుల జీవితం గడుపుతుంటే, పిల్లలు సెల్‌ఫోన్లకే పరిమితమవుతున్నారు. తమ మదిలోని భావాలను పంచుకోలేక, ఒత్తిడిని జయించలేక, ఆత్మన్యూనతా భావంతో కుమిలిపోతున్నారు. తమ సమస్యే ప్రపంచంలోకెల్లా పెద్దదని భ్రమపడి, ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నారని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదర్శం.. వీణా-వాణి! : కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోవడం కాదు, వాటిని ఎదురొడ్డి నిలవడమే జీవితం అని నిరూపిస్తున్నారు అవిభక్త కవలలు వీణా-వాణి. పుట్టినప్పటి నుంచి అంతులేని శారీరక, మానసిక పోరాటం చేస్తున్నా, డిగ్రీ పూర్తి చేసి, ఇప్పుడు సీఏ చదవాలన్న వారి సంకల్పం ఎందరికో ఆదర్శం. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతున్న యువత, కష్టాల కడలిని ఎదురీదుతున్న వీరిని ఒక్కసారి ఆదర్శంగా తీసుకుంటే, ఆత్మహత్య అనే ఆలోచనే రాదు.
ఒక్క క్షణం ఆలోచిస్తే, ఎంతో విలువైన జీవితాన్ని కాపాడుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగడం, వారి సమస్యలను ఓపికగా వినడం ద్వారా ఇలాంటి ఎన్నో అనర్థాలను ఆపవచ్చు.


