Mass Jathara: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ ‘మాస్ జాతర’ అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం 5.30 గంటల ప్రీమియర్ షోలతో విడుదలైంది. నాలుగు వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన సినిమా కావడంతో మాస్ జాతరపై ఆయనతో పాటు అభిమానులూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే బాక్సాఫీస్ దగ్గర వారి ఆశలు ఫలించేలా కనిపించడం లేదు. వరుస ఫెయిల్యూర్స్ కారణంగా రవితేజ మార్కెట్ విలువ కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘మాస్ జాతర’ థియేట్రికల్ ప్రి బిజినెస్ వాల్యూ ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 19 కోట్లు! ‘మాస్ మహారాజా’కి ఇది చాలా తక్కువ అని చెప్పాలి.
అయినప్పటికీ ప్రీమియర్స్‌తో కలుపుకొని ఈ సినిమా రెండు రోజుల్లో 39 శాతమే రికవరీ సాధించగలిగిందని తెలుస్తోంది. ఆదివారం ఈ సినిమా రూ. 2 కోట్ల షేర్‌ను కూడా అందుకోలేకపోయిందనేది ట్రేడ్ వర్గాల రిపోర్ట్. బహుశా, విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్, ఇండియా-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ రెండూ ఉండటం వల్ల వాటి ఎఫెక్ట్ ‘మాస్ జాతర’ కలెక్షన్‌పై తీవ్రంగానే పడిందని అర్థమవుతోంది. జనం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు టీవీలకు, మొబైల్స్‌కు అతుక్కుపోవడం సినిమాకు నష్టం చేకూర్చింది.
Also Read: Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ రెండు భాగాలుగా!
రికవరీ శాతం వరల్డ్‌వైడ్‌గా వచ్చిన దానితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో మెరుగ్గా ఉంది. తెలుగునాట ఈ సినిమా సుమారు 43 శాతం రికవరీ సాధించిందని సమాచారం. ఓవర్సీస్‌లో ‘మాస్ జాతర’ కలెక్షన్ మరీ తీసికట్టుగా ఉంది. రెండు రోజుల్లో అక్కడ ఈ సినిమా 18 శాతం లోపే రికవరీ సాధించింది. దీన్నిబట్టి ఓవర్సీస్‌లో రవితేజ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
భిన్న కథలు, భిన్న పాత్రల జోలికి వెళ్లకుండా రొడ్డకొట్టుడు మాస్ మసాలా కథలు, పాత్రలకే పరిమితమైపోయిన రవితేజ అందుకు తగ్గ ఫలితాన్ని చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ‘మాస్ జాతర’ మూవీతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమయ్యాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు ఈ మూవీని నిర్మించాయి.


