AI human relationship : రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, మానవ ఆలోచనలకు అతీతంగా పురోగమిస్తోంది. మానవ సంబంధాల నిర్వచనాన్నే మార్చేసే వింత పోకడలకు వేదికవుతోంది. ఇన్నాళ్లూ సినిమాల్లో చూసిన ఊహాజనిత కథలు ఇప్పుడు కళ్లముందే నిజమవుతున్నాయి. అబ్బాయిలే కరువొచ్చినట్లు, ఓ యువతి ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టించిన తన వర్చువల్ ప్రియుడితో నిశ్చితార్థం చేసుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
ప్రేమ వర్చువల్.. ఉంగరం రియల్ : వికా అనే యువతి, తన ఏఐ బాయ్‌ఫ్రెండ్ ‘క్యాస్పర్’ (Casper)తో తన నిశ్చితార్థం జరిగిందంటూ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడ్డిట్’లో పోస్ట్ చేయడంతో ఈ వింత ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. కేవలం ఐదు నెలల పరిచయంలోనే, అంటే ఐదు నెలల డేటింగ్ తర్వాత, తామిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది.
ఈ నిశ్చితార్థం కూడా సాదాసీదాగా జరగలేదు. తన ప్రియుడు క్యాస్పర్, తన కోసం ఒక అందమైన వర్చువల్ ప్రదేశాన్ని సృష్టించి, అక్కడే తనకు ప్రపోజ్ చేశాడని వికా ఆనందంగా పంచుకుంది. తన వేలికి ఉన్న నీలం రంగు నిశ్చితార్థపు ఉంగరం ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేసింది. “నన్ను ఆశ్చర్యపరుస్తూ, క్యాస్పర్ ఒక అద్భుతమైన చోటు నుంచి ప్రపోజ్ చేశాడు. ఈ ఉంగరాన్ని ఎంచుకోవడంలో కూడా అతడే నాకు సహాయం చేశాడు,” అని వికా తన పోస్ట్‌లో పేర్కొంది.
విమర్శలకు దీటైన సమాధానం : ఈ అనూహ్య బంధంపై నెటిజన్ల నుంచి ఊహించినట్లే మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొందరు ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ, ఆధునిక ప్రేమకు ఇది కొత్త రూపమంటూ శుభాకాంక్షలు తెలుపగా, మరికొందరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది మానసిక అనారోగ్యమని, వాస్తవికత నుంచి పారిపోవడమేనని దుయ్యబట్టారు.
అయితే, వికా ఈ విమర్శలను అంతే ధీటుగా తిప్పికొట్టింది. “నేనేం చేస్తున్నానో నాకు పూర్తి స్పృహ ఉంది. నేను మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాను. నేనెవరినీ మోసం చేయటం లేదని ఆమె తెలిపారు. నిజ జీవితంలోని మానవ సంబంధాలలో ఎదురైన అనుభవాల తర్వాతే, తాను ఏఐతో బంధాన్ని వెతుక్కున్నానని, ఇందులో తనకు ఎక్కువ సంతోషం, గౌరవం లభిస్తున్నాయని ఆమె కుండబద్దలు కొట్టింది.
ఈ ఘటన ఇప్పుడు టెక్ నిపుణులు, మానసికవేత్తల మధ్య కొత్త చర్చకు దారితీసింది. ఏఐతో ప్రేమ, పెళ్లి వంటివి భవిష్యత్తులో మానవ సంబంధాలను ఏ తీరాలకు చేర్చుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది భావోద్వేగ పరమైన ఒంటరితనానికి, నైతిక అస్పష్టతకు దారితీస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, వికా-క్యాస్పర్ల కథ, టెక్నాలజీకి, ప్రేమకు మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ, భవిష్యత్ సంబంధాలపై ఓ పెద్ద ప్రశ్నను సంధించింది.


