Prayagraj floods viral videos: ఉత్తర భారతదేశాన్ని కుండపోత వర్షాలు కుదిపేస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా యూపీలోని ప్రయోగ్ రాజ్ వరుణుడి ధాటికి అల్లకల్లోలం అయింది. జనజీవనం పూర్తి స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ నీటమునిగాయి. అక్కడ వరదలు ఏ స్థాయిలో ఉన్నాయనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో అద్ధం పడుతోంది.
వీడియో ఓపెన్ చేస్తే.. భారీ వర్షాలకు యూపీలోని పలు నగరాల్లో వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అలాంటి వాటిలో ప్రయోగ్ రాజ్ కూడా ఒకటి. నగరంలోని ఓ వీధిలోకి పీకల్లోతు వరకు వరద నీరు వచ్చింది. ఈ క్రమంలో కొన్ని కుటుంబాలు అక్కడ చిక్కుకుపోయాయి. ఈ క్రమంలో ఓ జంట తమ నవజాత శిశువును బాహుబలి సినిమాలో చూపించినట్లు తలపై మోస్తూ తీసుకెళ్లున్న వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. చోటా బఘాడా ప్రాంతానికి చెందిన వీరు ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
అక్కడున్న లోకల్స్ వరద నీటిలో చిక్కుకున్న ప్రజల అవస్థలు తెలియాలని ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై రాష్ట్రంలోని అపోసిషన్ పార్టీలు మండిపడుతున్నాయి.యూపీ సీఎం 20 కోట్లతో చేసిన అభివృద్ధి ఇదేనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఆడంబరాల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టే యోగి సర్కారు.. పేద ప్రజలను మాత్రం గాలికొదిలేసిందంటూ కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు గంగా, యమున నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. దీంతో అక్కడి అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. శనివారం సాయంత్రం నాటికి నదుల నీటి మట్టం 84.734 మీటర్లు దాటి ప్రమాద స్థాయిని మించిపోయింది. చాలా ప్రాంతాల్లోకి వరద నీరు చొచ్చుకురావడంతో వేలాది ఇళ్లు నీటి మునిగాయి. సుమారు 3,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రక్షణ మరియు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.


