Giant python rescue Odisha : ఓ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలోని పొదల్లో ఏదో వింత ఆకారం కదులుతూ కనిపించింది. మొదట చూసిన వారు భయంతో వెనక్కి తగ్గినా, అదేంటో తెలుసుకోవాలన్న కుతూహలంతో మెల్లగా అడుగులు ముందుకు వేశారు. తీరా దగ్గరికి వెళ్లి చూసిన వారికి ఒళ్లు జలదరించింది. ఇంతకీ ఆ పొదల్లో స్థానికులకు కనిపించిందేమిటి..? ఆ తర్వాత ఏం జరిగింది..?
ఒడిశా రాష్ట్రం, కటక్ జిల్లాలోని ఆఠగఢ్ ఘంటిఖాల్ ప్రాంతంలో ఓ భారీ కొండచిలువ స్థానికంగా కలకలం రేపింది. జేకే లక్ష్మీ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలోని పొదల్లో ఏకంగా 15 అడుగుల పొడవున్న ఈ కొండచిలువను చూసి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ ఆకారంతో నెమ్మదిగా కదులుతున్న దాన్ని చూసి తొలుత భయపడినా, కాసేపటికే ధైర్యం చేసి పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు.
అయితే, ఆ కొండచిలువ పెద్దగా కదలకుండా ఒకేచోట మందకొడిగా పడి ఉండటాన్ని గమనించిన కొందరు, అది ఏదైనా పెద్ద అడవి జంతువును మింగి, జీర్ణం చేసుకోలేక కదల్లేని స్థితిలో ఉండిపోయిందని అనుమానించారు. పరిస్థితిని గమనించిన ఓ స్థానికుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, పాములను పట్టడంలో నిపుణుడైన శుశాంత పాత్రాకు వెంటనే సమాచారం అందించాడు.
సురక్షితంగా అడవిలోకి : సమాచారం అందుకున్న శుశాంత పాత్రా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వందలాది మంది ప్రజలు గుమిగూడి ఉన్నప్పటికీ, ఆయన ఏమాత్రం బెదరకుండా తన నైపుణ్యంతో కొండచిలువను అత్యంత జాగ్రత్తగా బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు అక్కడికి చేరుకుని కొండచిలువను పరిశీలించారు. దానికి ఎలాంటి గాయాలు కాలేదని నిర్ధారించుకున్న తర్వాత, దానిని సురక్షితంగా సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. భారీ కొండచిలువకు ఎలాంటి అపాయం కలగకుండా, జనాలకు ముప్పు వాటిల్లకుండా సురక్షితంగా తరలించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. శుశాంత పాత్రా చేసిన సాహసాన్ని ప్రకృతి ప్రేమికులు, అధికారులు, స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. జనావాసాల్లోకి అడవి జంతువులు వచ్చినప్పుడు భయపడి వాటిపై దాడులు చేయడం, గాయపరచడం వంటివి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వెంటనే తమకు గానీ, పాములను పట్టే నిపుణులకు గానీ సమాచారం అందించాలని కోరారు.


