Rs 500 notes discontinued : “సెప్టెంబర్ నుంచి ఏటీఎంలలో రూ.500 నోట్లు రావు! మీ దగ్గర ఉన్న నోట్లను త్వరగా వాడేసుకోండి!”.. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఇప్పుడు ఓ సందేశం కార్చిచ్చులా వ్యాపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు నాటి అనుభవాలు ఇంకా పచ్చిగా ఉండటంతో, ఈ వార్త చూసి సామాన్యులు తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురవుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశం
గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఒక సందేశం విపరీతంగా షేర్ అవుతోంది. దాని సారాంశం ఇది: “ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, సెప్టెంబర్ నుంచి ఏటీఎంలలో రూ.500 నోట్ల పంపిణీ నిలిపివేయబడుతుంది. 2026 మార్చి నాటికి 75%, ఆ తర్వాత 90% ఏటీఎంలలో కేవలం రూ.100, రూ.200 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి, ప్రజలు తమ వద్ద ఉన్న రూ.500 నోట్లను వీలైనంత త్వరగా ఖర్చు చేయడం మంచిది.” ఈ సందేశం నిజమని నమ్మిన చాలా మంది, తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ, ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు.
రంగంలోకి దిగిన పీఐబీ.. ఫేక్ అని తేల్చివేత!
ఈ వదంతుల వ్యాప్తిని గమనించిన కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)కు చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం వెంటనే రంగంలోకి దిగింది. ఈ వార్తపై పూర్తిస్థాయిలో నిజ నిర్ధరణ చేపట్టింది. సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవం, కల్పితం అని తేల్చి చెప్పింది.
“వాట్సాప్, ఎక్స్ వంటి మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వార్త పూర్తిగా నకిలీది. ఇది ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం. ఏటీఎంల నుంచి రూ.500 నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ప్రస్తుతం దేశంలో రూ.500 నోట్లు చెల్లుబాటులో ఉన్నాయి, యథావిధిగా ఏటీఎంలలో అందుబాటులో ఉంటాయి” అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.
ఇదేమీ కొత్త కాదు.. వదంతులు నమ్మొద్దు!
కరెన్సీ నోట్లపై ఇలాంటి అసత్య ప్రచారాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ‘రూ.500, రూ.2000 నోట్లు ఇక చెల్లవు’ అని, ‘పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ఇదే చివరి తేదీ’ అంటూ అనేక నకిలీ వార్తలు ప్రజలను గందరగోళంలోకి నెట్టాయి. ప్రతీసారి పీఐబీ ఇలాంటి వార్తలను ఖండిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. పీఐబీ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేసింది. ఆర్బీఐ, పీఐబీ వంటి అధికారిక ప్రభుత్వ సంస్థలు వెల్లడించిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది. అనవసరమైన భయాందోళనలను నివారించేందుకు, మీకు వచ్చిన ఏదైనా సందేశాన్ని గుడ్డిగా నమ్మి ఇతరులకు ఫార్వర్డ్ చేసే ముందు, దాని నిజానిజాలను కచ్చితంగా తనిఖీ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.


