Telangana flood wedding : పెళ్లి పందిరి సిద్ధంగా ఉంది. వధువు సర్వాంగ సుందరంగా ముస్తాబై వరుడి రాక కోసం ఎదురుచూస్తోంది. బంధుమిత్రుల కోలాహలంతో కళ్యాణ మండపం కళకళలాడుతోంది. పురోహితుడు సుముహూర్తానికి సమయం దగ్గరపడుతోందని హెచ్చరిస్తున్నాడు. కానీ, అసలు కథానాయకుడైన పెళ్లికొడుకు జాడ లేదు. ఏమైంది? ఎక్కడున్నాడు? అని ఆరా తీస్తే.. ఊరి చివర ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగుకు ఆవలి ఒడ్డున నిస్సహాయంగా నిలబడి ఉన్నాడు. ఒకవైపు కరిగిపోతున్న కాలం, మరోవైపు ఉగ్రరూపం దాల్చిన వరద. ఈ గండం నుంచి గట్టెక్కి ఆ వరుడు పెళ్లిపీటల మీదకు ఎలా చేరుకున్నాడు..? ఆ తర్వాత ఏం జరిగింది..?
కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన, సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. జగిత్యాల జిల్లా, గుంజపడుగు గ్రామానికి చెందిన కొముర మల్లుకు, గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన టేకు భాగ్యకు పెద్దలు వివాహం నిశ్చయించారు. ఆగస్టు 13, బుధవారం నాడు పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించారు.
వరద రూపంలో వచ్చిన అడ్డంకి : ముహూర్తం రోజున వరుడు కొముర మల్లు తన బంధుగణంతో కలిసి వివిధ వాహనాల్లో వధువు ఊరికి బయలుదేరాడు. వెంకట్రావుపల్లి, పొత్తూరు మీదుగా గన్నేరువరం గ్రామ సమీపానికి చేరుకున్నాడు. కానీ, ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గ్రామ శివారులోని చెరువు మత్తడి దుంకి, వాగు ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. రోడ్డుపై వరద నీరు ఉధృతంగా పారుతుండటంతో గ్రామంలోకి వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది.
ఒడ్డున నాలుగు గంటల నిరీక్షణ : వరుడు, అతని బంధువులు వాగు ఒడ్డునే నిలిచిపోయారు. గంటగంటకూ వరద ఉధృతి పెరగడమే తప్ప తగ్గలేదు. సమయం గడిచిపోతోంది, ముహూర్తం దగ్గరపడుతోంది. ఏం చేయాలో పాలుపోక, దాదాపు నాలుగు గంటల పాటు వరద శాంతిస్తుందేమోనని అక్కడే నిరీక్షించారు. కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి.
భుజాలపై పెళ్లికొడుకు.. సాహసోపేత యాత్ర : ఇక లాభం లేదని, “ముహూర్తం మించిపోతోంది, వెళ్లి తీరాల్సిందే” అని వరుడు సాహసానికి సిద్ధపడ్డాడు. స్థానికులు ప్రమాదమని వారిస్తున్నా, వినలేదు. దీంతో బంధువులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. బంధువులలో కొందరు కలిసికట్టుగా, ఒకరు వరుడిని గట్టిగా భుజాలపైకి ఎత్తుకోగా, మరికొందరు చుట్టూ మానవహారంగా ఏర్పడి రక్షణగా నిలిచారు. హోరున హోరెత్తుతున్న వరదలో, ఛాతీ లోతు నీటిలో అడుగులో అడుగేసుకుంటూ వాగును దాటడం ప్రారంభించారు. ఆ దృశ్యం చూపరుల గుండెల్లో దడ పుట్టించింది.
ఆలస్యంగానైనా మూడు ముళ్లు : సుమారు నాలుగు గంటల ఆలస్యంగా, వరుడు బృందం సురక్షితంగా వధువు ఇంటికి చేరుకుంది. అప్పటికే ఆందోళనతో ఎదురుచూస్తున్న వధువు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వారు క్షేమంగా రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత, వరుడి తల్లిదండ్రులను, మిగిలిన బంధువులను కూడా నెమ్మదిగా వాగు దాటించారు. చివరకు, ఆలస్యంగానైనా వేదమంత్రాల సాక్షిగా, వధువు భాగ్య మెడలో వరుడు మల్లు మూడు ముళ్లు వేసి ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రకృతి సృష్టించిన ఆటంకాన్ని ప్రేమ, పట్టుదలతో అధిగమించిన ఈ పెళ్లి వేడుక, స్థానికంగా చిరకాలం గుర్తుండిపోతుంది.


