Telegram Founder Pavol Durov Comments: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ (Pavol Durov) ఎప్పుడూ వార్తల్లో నిలిస్తుంటారు. తనదైన శైలిలో లైఫ్, ఫ్యామిలీ, సంస్థకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. ఇప్పటికే “లీ పాయింట్” మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ బాంబు పేల్చారు. గత 15 ఏళ్లలో 12 దేశాల్లో సుమారు 100 మంది పిల్లలు తన వీర్యదానంతో జన్మించారని ఆయన చెప్పారు. ఇది అప్పట్లో ఇంటర్‌నెట్‌ని ఊపేసింది. వీరిలో కొందరు తన స్నేహితుల కోరికపై, మరికొందరు క్లినిక్‌ల ద్వారా భాగమయ్యారని చెప్పారు.
తనకు ముగ్గురు వేర్వేరు భార్యల నుంచి ఆరుగురు పిల్లలు ఉన్నారని కేవలం వారిని మాత్రమే అధికారికంగా తాను తండ్రిగా ఉన్నానని వివరించారు. సహజ పద్ధతిలో జన్మించిన పిల్లలతో పాటు వీర్యదానంతో పుట్టిన వారికి సమానంగా తన ఆస్తిని రాసి ఇవ్వనున్నట్లు మరో బాంబు పేల్చారు. అయితే 30 ఏళ్లు వచ్చే వరకు ఈ ఆస్థిని వారు పొందలేరని అన్నారు. దీనికి కారణం వారు స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. దీని కారణంగానే తాను అనేక మందికి శత్రువు మిగిలినట్లు చెప్పారు. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాటం ఇలాంటి నిర్ణయాలకు దారితీస్తుందని అన్నారు.
తన మరణానంతరం టెలిగ్రామ్ సంస్థను లాభాపేక్షలేని ఫౌండేషన్‌కు అప్పగించాలన్నదే తన ఆలోచన అని పేర్కొన్నారు. ముఖ్యంగా గోప్యతను, స్వేచ్ఛను కాపాడే వేదికగా టెలిగ్రామ్‌ని కొనసాగాలని ఆశించడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం వరల్డ్‌వైడ్‌గా టెలిగ్రామ్‌కి బిలియన్ సంఖ్యలో యూజర్లు ఉన్నారు. అయితే దీని సీఈవో చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఇంటర్‌నెట్ మార్మోగుతోంది.


