Rauwolfia serpentina Benefits: మన పూర్వీకులు అపారమైన జ్ఞాన సంపత్తిని మనందరికీ అందించారు. మనకు తెలియని ఎన్నో విషయాలను మునులు, ఋషులు వేల సంవత్సరాల కిందటే తాళపత్రాల గ్రంథాల్లో పొందుపరిచారు. అప్పట్లో ప్రతి వ్యాధిని ఔషధ మూలికల ద్వారా నయం చేసేవారు. ఇలాంటి వైద్య విధానం గురించి చరకసంహితలో ఉంది. అదే విధంగా అప్పట్లోనే సుశ్రుతుడు సర్జరీలు చేసేవాడు. దీని గురించి సుశ్రుత సంహిత తెలియజేస్తుంది.
మన భారతీయ వైద్య విధానంలో మెుక్కలను ఔషధాలుగా ఉపయోగించడం అనాదిగా వస్తుంది. జ్వరం నుంచి కేన్సర్ వరకు నయం చేసే ఔషధ మెుక్కలు మన అడవుల్లో ఉన్నాయి. అలాంటి అరుదైన మెుక్క జాతుల్లో సర్పగంధ మెుక్క ఒకటి. దీనిని పాతాల గరిడి అని కూడా పిలుస్తారు. దీని సైంటిఫిక్ నేమ్ రవుల్పియా సర్పెంటినా. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
పాము కాటుకు విరుగుడు
సర్పగంధ అనేది గుబురుగా ఉండే చిన్న మొక్క. పాముని పోలిన వేర్లు ఉండటం వల్ల దీనికి ఆ పేరు స్థిరపడింది. ఈ మెుక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీనికి ఆయుర్వేదం, అల్లోపతిలోనూ వాడతున్నారు. అంతేకాకుండా దీనిని పాము కాటుకు విరుగుడుగా కూడా వాడతారు. మానసిక వ్యాధులు మరియు శ్వాసకోశ వ్యాధులతో సహా అనేక రుగ్మతలను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పాముతో కోట్లాటకు దిగే ముందు ముంగిస సర్పగంధ ఆకుల రసాన్ని పీలుస్తుందని చెబుతారు. పాములు ఈ మెుక్క వాసన తగలగానే పారిపోతాయట.
సర్పగంధ ఉపయోగాలు
కఫం మరియు వాతాన్ని తగ్గించడంలోనూ, నిద్ర పట్టేటట్లు చేయడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గర్భిణులకు సుఖప్రసవం అయ్యేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గాయాలను నయం చేస్తుంది. నొప్పులను తగ్గిస్తాయి. బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. కళ్ల మసకను దూరం చేస్తుంది. మెదడు వ్యాధుల చికిత్సలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. పిచ్చిని నయం చేస్తుంది.


