Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్kashmir assembly election 2024: సమస్యల వలయంలో కాశ్మీర్‌ ఎన్నికలు

kashmir assembly election 2024: సమస్యల వలయంలో కాశ్మీర్‌ ఎన్నికలు

ప్రధాన ప్రచారాంశంగా రాష్ట్ర ప్రతిపత్తి అంశం..

సుమారు పదేళ్ల విరామం తర్వాత ఎన్నికలు జరగబోతున్న జమ్మూ కాశ్మీర్‌ లో భవిష్యత్తులో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో పార్టీల నాయకులు, ప్రజలు ఈ ఎన్నికల పట్ల ఎంతో ఉత్సాహం, ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. 2019లో ఆర్టికల్‌ 370ని, రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఇక్కడ శాసనసభ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న కొద్దీ ఇక్కడి పార్టీలన్నిటికీ ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించడమన్నది ప్రధాన ప్రచారాంశంగా మారింది. ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తామంటూ ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఓటర్లకు వాగ్దానం చేస్తున్నాయి. వేర్పాటువాదుల సానుభూతిపరులు ఇటువంటి అనవసర ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ విమర్శలు సాగిస్తోంది. ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని బీజేపీ పదే పదే చెబుతోంది. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ ఆర్టికల్‌ 370 విషయంలో గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోంది. దీని గురించి ఎక్కడా మాట వరసకు కూడా ప్రస్తావించని కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రతిపత్తి విషయంలో మాత్రం స్పష్టమైన వాగ్దానం చేస్తోంది.
ఇక్కడ మూడు దశలుగా జరుగుతన్న ఎన్నికల్లో మొదటి దశలో 50 శాసనసభ స్థానాలకు 529 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. ప్రధాన జాతీయ రాజకీయ పక్షాలు, ప్రాంతీయ పార్టీలు కాకుండా, సామాజిక-మతపరమైన సంస్థగా వ్యవహరిస్తున్న జమాతే ఇస్లామీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కొద్ది కాలం క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను అసాంఘిక సంస్థగా పరిగణించి నిషేధించడం జరిగింది. ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలున్న ఈ వేర్పాటువాద సంస్థ ఇక్కడ మత విద్వేష కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో గుర్తించింది. ఉత్తర, దక్షిణ కాశ్మీర్‌ లోని కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పార్టీ తమ పార్టీ తరఫున స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దించింది. గతంలో ఈ పార్టీ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చేది. ఎన్నికల్లో అల్లర్లు, హింసా విధ్వంసకాండలను సృష్టించేది. అటు వంటి సంస్థ ఈసారి ఎన్నికల్లో పాల్గొనడం నిజంగా హర్షణీయమైన విషయం. మరికొందరు వేర్పాటువాదులు కూడా ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు ఏర్పడడానికి ఈ మార్పులు దోహదం చేసే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా, ఇక్కడ పోటీ చేస్తున్న జమ్మూ కాశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (ఫారూఖ్‌ అబ్దుల్లా), పీపుల్స్‌ డెముక్రటిక్‌ పార్టీ (ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌), సాజద్‌ లోనే నాయకత్వంలోని జమ్మూ కాశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌లు 2019 ముందు నాటి పరిస్థితులను పునరుద్ధరించడానికి, ప్రజా భద్రతా చట్టాన్ని రద్దు చేయడానికి కంకణం కట్టుకున్నాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మిత్రపక్షమైన కాంగ్రెస్‌ తాము గనుక అధికారంలోకి వచ్చే పక్షంలో కాశ్మీర్‌ లో ‘బయటివారు భూములు కొనకుండా, ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోకుండా, ఉద్యోగాలు సంపాదించు కోకుండా, వనరులు ఉపయోగించుకోకుండా చేస్తా’మని వాగ్దానాలు చేస్తోంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారాలను కత్తిరిస్తామని కూడా ప్రచారం చేస్తోంది. ఇక బీజేపీ జమ్మూ ప్రాంతంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా తమ బలాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే అది షెడ్యూల్డ్‌ తెగలు, షెడ్యూల్డ్‌ కులాలు, ఓబీసీలను చాలావరకు ఆకట్టుకోగలిగింది. అంతేకాదు, పీర్‌ పాంజల్‌ లోయలోని పహాడీ వర్గానికి చెందిన ముస్లిలను కూడా అది చాలావరకు తన వైపు తిప్పుకోగలిగింది. చాలా ఏళ్లుగా ఆందోళన చేస్తున్న ఈ వర్గానికి కేంద్రం ఇటీవలే షెడ్యూల్డ్‌ తెగల హోదాను మంజూరు చేసింది.
జమ్మూ కాశ్మీర్‌ లో 11 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించిన బీజేపీ ఇక్కడ కాంగ్రెస్‌ మాదిరిగానే వారసత్వ రాజకీయాల్లో ఉన్న ఎన్‌.సి, పి.డి.పి పార్టీలను తీవ్రస్థాయిలో దుయ్యబడుతోంది. ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతంలో సరికొత్త రాజకీయ నాయకత్వం ఆవిర్భ వించే అవకాశం ఉందని బీజేపీ ఎన్నికల వ్యూహకర్త రాంమాధవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు అక్టోబర్‌ 8న వెలువడుతాయి. ఆ తర్వాత నుంచి జమ్మూ కాశ్మీర్‌ లో సరికొత్త, సానుకూల రాజకీయ వాతావరణం ఏర్పడే అవకాశం స్పష్టం కనిపిస్తూనే ఉంది. ఈ సుసంపన్న రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదద్దగలగిన అవకాశాలను బీజేపీతో సహా వివిధ పార్టీలు అందిపుచ్చుకోవడానికి ఎదురు చూడాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News