ఈ మధ్య అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) విడుదల చేసిన నివేదిక ప్రకారం యాంత్రికీకరణ, కృత్రిమ మేధ వంటి ఆధునిక టెక్నాలజీ ప్రక్రియల కారణంగా ఆదాయ సంబంధమైన అసమానతలు మరింతగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు, సమాజాలు ఈ సమస్య పైన తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. కార్మిక ఆదాయం తగ్గిపోవడం వల్ల, స్తంభించి పోవడం వల్ల ఆదాయ అసమానతలు తీవ్రస్థాయిలో ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, విద్యాధిక యువతీ యువకులకు ఉద్యోగాలు అందుబాటులో లేకపోవడమో, నైపుణ్యాలు కొరవడడమో, సరైన శిక్షణ లభించకపోవడమో జరుగుతోందని ఇటీవల విడుదలైన ‘ది వరల్డ్ ఎంప్లాయ్ మెంట్ అండ్ సోషలిస్ట్’ (The world employment and socialist) నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది. మొత్తం ప్రపంచ ఆదాయంలో కార్మికాదాయ శాతం ఆయేటికాయేడు 0.6 శాతం చొప్పున తగ్గిపోతోందని, 2019-22 సంవత్సరాల మధ్య ఇది మరింత ఎక్కువగా తగ్గిపోయినట్టు కనిపిస్తోందని, ఇక నుంచి ఇది ఒక అగాధంలా మారిపోయే ప్రమాదం ఉందని కూడా అది తెలియజేసింది. అంతేకాక, ఇది 2002-24 సంవత్సరాల మధ్య 1.6 శాతం తగ్గిపోయింది. దీని అర్థం ఏమిటంటే, కార్మికాదాయం 26 లక్షల కోట్ల డాలర్ల మేరకు తగ్గిపోయింది. ప్రపంచం మొత్తం మీద చూస్తే 28 శాతానికి పైగా మహిళలు, 13 శాతానికి పైగా పురుషులు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. ఇక భారతదేశం విషయానికి వస్తే నిరుద్యోగులలో 83 శాతం మంది యువతీ యువకులే.
అసలే తీవ్రస్థాయి అసమానతలతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచాన్ని కోవి్‌డ మరింత అగాధంలోకి నెట్టేసింది. అసమానతలు పేట్రేగడం కోవిడ్ కాలం నుంచే ఊపందుకుంది. మూలధన ఆదాయం సమాజంలోని కొద్ది మంది చేతుల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఉత్పాదకత, దిగుబడి పెరగడం జరుగుతుంది. పారిశ్రామిక విప్లవం దీన్ని అనేక విధాలుగా నిరూపించింది. అయితే, ఉత్పత్తి రంగంలో కాలక్రమంలో గణ నీయంగా మార్పులు చోటు చేసుకోవడంతో దాని ప్రభావం ఆర్థిక సంబంధాల మీద కూడా పడింది. అయితే, ఇదివరకటి మాదిరిగా ఉత్పత్తి పెరుగుదల మీద కార్మికుల ప్రభావం లేనందువల్ల అనేక రంగాల్లో కార్మిక ప్రాధాన్యం తగ్గింది. ప్రస్తుతం ఆధునిక యాంత్రికీకరణ, కృత్రిమ మేధల కార ణంగా ఉత్పత్తి పెరుగుతోందే తప్ప కార్మికుల కారణంగా కాదనే అభిప్రాయం బలపడుతోంది. అతి తక్కువ సంఖ్య కార్మికులతో ఆశించిన ఉత్పత్తి సాధ్యమవుతోంది. ప్రస్తుతం భారతదేశంలో స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయే తప్ప ఉద్యోగావకాశాలు పెరగడం లేదని ఈ నివే దిక తెలిపింది. ఉద్యోగంలో సంపాదించే ఆదాయం కంటే స్వయం ఉపాధి ద్వారా సంపాదించే ఆదాయం సగమే అయినప్పటికీ విద్యావంతులు స్వయం ఉపాధి వైపే మొగ్గు చూపడం జరుగుతోంది.
అయితే, అసమానతలు పెరుగుతున్న కొద్దీ దీని దుష్పరిణామాలు చాలా తీవ్రస్థాయిలో ఉంటా యని ఈ నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా 2030 నాటికి సాధించాలనుకున్న సుస్థిర అభివృద్ది లక్ష్యాలను సాధించడం కష్టమవుతుందని, ఒక వేళ సాధించినా దాని వల్ల ఆశించిన ఉపయోగం ఉండదని అది స్పష్టం చేసింది. టెక్నాలజీ అభివృద్ధి వల్ల, పురోగతి వల్ల ఒనగూడుతున్న ప్రతి ఫలాలు కూడా సమాజంలో అందరికీ సమానంగా పంపిణీ కావాల్సిన అవసరం ఉంది. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు తమ విధానాలను, కార్యక్రమాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ సవాళ్లన్నీ సుస్థిర అభివృద్ధికే పరిమితం కాలేదు. కార్మికాదాయం తగ్గడంతో గల్లంతయిన 26 లక్షల కోట్ల డాలర్లు సంపన్నుల జేబుల్లోకి వెళ్లిపోవడం వల్ల, అసమానతలు తగ్గడానికి అనేక విధాలైన విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. ఆధునిక యాంత్రికీకరణ, కృత్రిమ మేధ (AI) వంటి టెక్నాలజీ ప్రక్రియలు పురోగతి చెందుతున్న కొద్దీ ఆదాయ సంబంధమైన అసమానతలు మరింతగా పెరిగే అవకాశమే ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. కార్మికులు, పేదలకు ఉపాధి అవకాశాలు పోకుండా, ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందేలా ప్రభుత్వాలు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవడం ప్రారంభించాలి. ఆదాయం పెరిగినా, అసమానతలు పెట్రేగినా సామాజిక, రాజకీయ పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఒక్కో దేశంలో ఒక్కో రకం పరిస్థితులున్నందువల్ల అన్ని దేశాలకూ ఒకే రకమైన విధానం ఉండే అవకాశం లేదు.
ILO report is shocking: కార్మికుల అవసరం తగ్గుతోందా?
మనషుల ప్లేస్ లో టెక్నాలజీ