Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Russia-Ukrain war ends: రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ముగియబోతుందా ?

Russia-Ukrain war ends: రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ముగియబోతుందా ?

చర్చలలో భారత్ కీలక పాత్ర

రెండున్నరేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగియడానికి మార్గం సుగమం అవుతోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగించడంపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ వైఖరి మారింది. ప్రత్యర్థి దేశమైన ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్దమేనంటూ పరోక్షంగా ఆయన సంకేతాలిచ్చారు. అయితే ఈ చర్చలలో భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించాలని పుతిన్ కోరారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా పడింది. యావత్ ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఈ యుద్ధం ఫలితంగా అనేక ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. రష్యాపై పలు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. ఇదిలా ఉంటే రష్యా – ఉక్రెయిన్ మధ్య చర్చలలో భారత్ కీలక పాత్ర పోషించబోతోంది.

- Advertisement -

రష్యా – ఉక్రెయిన్ యుద్దం త్వరలో ముగియబోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ రష్యా అధినేత వ్లాదిమిర్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. 2022 ఫిబ్రవరి 24 ….. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు మొద‌లు పెట్టిన రోజు. ఉక్రెయిన్‌పై సైనిక దాడులు ప్రారంభమై రెండేన్నరేళ్లు దాటింది. అయితే రావణకాష్టంలా ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శాంతిమంత్రం ఆలపించారు. ఉక్రెయిన్‌తో యుద్దానికి స్వస్తి పలకడానికి రష్యా సిద్దంగా ఉందన్నారు. అయితే ఇందుకు సంబంధించి తాను ఏకపక్ష నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం లేదన్నారు. భారత్ తో పాటు చైనా, బ్రెజిల్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తే అందుకు తాను అంగీకరిస్తానని వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. వ్లాదిమిర్ పుతిన్ చేసిన ఈ ప్రకటనతో రష్యా – ఉక్రెయిన్ యుద్దం ముగియడానికి దారి సుగమం అవుతోంది. ఉక్రెయిన్‌పై సైనిక దాడులు ప్రారంభించిన తొలిరోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడు మీద ఉన్నారు. ఈ యుద్దంలో ప్రపంచ దేశాలేవీ జోక్యం చేసుకోకూడదని హెచ్చరించారు. తన మాటను కాదని ఏ దేశమైనా జోక్యం చేసుకుంటూ తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించారు. సహజంగా ఉక్రెయిన్‌కు అమెరికాతో మంచి సంబంధాలున్నాయి. దీంతో అమెరికా జోక్యాన్ని కూడా నివారించడానికి ఈ ఎపిసోడ్‌లో మూడో దేశం ఎంట్రీని ఆయన తోసిపుచ్చారు. పరోక్షంగా అమెరికాకు పుతిన్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పనిలోపనిగా అమెరికాతో పాటు నాటో కూటమి దేశాలకు కూడా పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. పుతిన్ మనస్తత్వం అందరికీ తెలిసిందే. దీంతో అమెరికా సహా ప్రపంచదేశాలేవీ ఉక్రెయిన్ యుద్దంలో జోక్యం చేసుకోలేదు. అమెరికా అయితే ఉక్రెయిన్‌పై సానుభూతి ఒలకబోస్తూ కాలం గడిపేసింది. కాగా రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం చూపించింది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు మొదలు పెట్టడంతో నాటో కూటమి తీవ్ర ఆగ్రహానికి గురైంది. నాటో కూటమి అంటే అగ్రరాజ్యమైన అమెరికా కనుసన్నట్లో నడిచే కూటమే. ఇది జగమెరిగిన సత్యం. దీంతో రష్యాపై నాటో కూటమిలోని అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఇదిలా ఉంటే తమకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించడంతో రష్యా మండిపడింది. అప్పటివరకు అనేక పశ్చిమ దేశాలకు రష్యా నుంచి చమురు సరఫరా అయ్యేది. ఇందుకు ప్రతిగా ఆయా పశ్చిమ దేశాలకు రష్యా చమురు సరఫరా నిలిపివేసింది. అంతిమంగా అనేక ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తల్లకిందులయ్యాయి.

రెండుగా చీలిపోయిన ప్రపంచదేశాలు
రష్యా – ఉక్రెయిన్ యుద్దం అంతర్జాతీయ రాజకీయాల్లో దుమారం రేపింది.యావత్ ప్రపంచం రెండుగా చీలిపోయింది. కొన్ని దేశాలు ప్రధానంగా నాటో కూటమి దేశాలు…ఉక్రెయిన్‌కు మద్దతు పలికాయి. కాగా చైనా, ఉత్తరకొరియా వంటి బహు తక్కువ దేశాలు మాత్రమే రష్యాకు అండగా నిలిచాయి. భారతదేశం మాత్రం ఎవరివైపు ఒరగలేదు. యుద్ధం ప్రారంభమైన తొలిరోజుల్లో తటస్థ విధానానికి భారత్ జై కొట్టింది. యుద్దం , సమస్యలకు పరిష్కారం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అనేకసార్లు స్పష్టం చేశారు. చర్చలతోనే రష్యా – ఉక్రెయిన్ యుద్దం ముగుస్తుందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా దౌత్య వ్యవహారాల్లో తన దక్షతను ఆయన మరోసారి నిరూపించుకున్నారు. ఈ ఏడాది జులైనెలలో రష్యాలో పర్యటించి వ్లాదిమిర్ పుతిన్‌ను ఆలింగనం చేసుకున్న నరేంద్ర మోడీ ఆ తరువాత ఉక్రెయిన్‌కు వెళ్లి ఆ దేశ అధినేత జెలెన్‌స్కీని కూడా అలాగే ప్రేమతో కౌగిలించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్‌ పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది. సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన తరువాత ఉక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అటువంటి ఉక్రెయిన్‌లో భారత ప్రధాని తొలిసారి పర్యటించారు. అది కూడా ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతాయో తెలియని దారుణ పరిస్థితుల మధ్య. దీంతో నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

పుతిన్ శాంతిమంత్రం జపించడంలో వ్యూహం ఏమిటి ?
యుద్దం ప్రారంభమైన తొలిరోజుల్లో రష్యా దూకుడు మీద ఉండేది. రష్యా దూకుడు చూసి ఒక వారంలో యుద్దం ముగుస్తుందని అందరూ భావించారు. రష్యా బలగాల దాటికి ప్రపంచపటం నుంచి ఏకంగా ఉక్రెయిన్ కనుమరుగు అవుతుందని అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఉక్రెయిన్ యుద్దం చేసింది. భారీ సంఖ్యలో సైనికులు, ప్రజలను కోల్పోయినప్పటికీ ఉక్రెయిన్ మనోధైర్యం కోల్పోలేదు. ప్రత్యర్థి రష్యా సేనలకు దీటుగా బదులివ్వడం మొదలెట్టింది. కొన్ని నెలల పాటు రష్యా బలగాల దాడులను ఉక్రెయిన్ కాచుకుంది. యుద్ధరంగంలో డిఫెన్స్ ఆడింది. రష్యాతో దాడులు చేద్దామంటే ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు ఉండేవి కావు. దీంతో రష్యాను ఎదుర్కోవడానికి ఆయుధాలు ఇవ్వవలసిందిగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ కోరింది. ఉక్రెయిన్‌ అడిగిందే తడవుగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేశాయి. అలాంటి ఇలాంటి ఆయుధాలు కాదు. అత్యంత అధునాతన ఆయుధాలు. పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలతో యుద్ధ స్వరూపాన్ని ఉక్రెయిన్‌ పూర్తిగా మార్చివేసింది. అప్పటివరకు ఆత్మరక్షణలో ఉన్న ఉక్రెయిన్ ఒక్కసారిగా ఎదురుదాడికి దిగింది. రష్యాపై ఎడాపెడా దాడులు మొదలెట్టింది. ఉక్రెయిన్ ఎదురుదాడులు చేస్తుందని రష్యా ఏనాడూ ఊహించలేదు. ఉక్రెయిన్ బలగాలకు దీటుగా కౌంటర్‌లు ఇవ్వాలని రష్యా నిర్ణయించుకుంది. అయితే రష్యా దగ్గర ఆయుధాలు తగ్గిపోయాయి. ఆయుధాల విషయంలో మొదటినుంచి రష్యాకు అండగా నిలిచింది ఉత్తర కొరియానే. యుద్ధ ప్రారంభమైన తరువాత రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేసింది. అంతేకాదు కొన్ని నెలల కిందట కూడా రష్యాకు ఆయుధాలు అందచేసింది ఉత్తర కొరియా. అయినప్పటికీ ఉక్రెయిన్‌తో పోలిస్తే రష్యా దగ్గర ఆయుధాలు తక్కువగా ఉన్నాయంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. మరోవైపు యుద్ద విరమణకు సంబంధించి పుతిన్‌పై ఒత్తిడి కూడా పెరిగింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా పుతిన్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రపంచపటంపై ఒక యుద్ధోన్మాదిగా నిలబెట్టింది ఉక్రెయిన్ యుద్ధం. అయితే యుద్ధం ఎప్పుడూ వేడుక కాదు. అంతులేని విషాద‌మే. ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు అంతులేని విషాదాన్ని మోసుకొచ్చాయి. ఈ నేప‌థ్యంలోనే హింస‌కు తావులేని స‌మాజాన్ని ప్రపంచం కోరుకుంది. శాంతి కోసం ప‌రిత‌పించింది. ఇప్పటికైనా ఉక్రెయిన్‌తో చర్చలకు రష్యా అధినేత పుతిన్ అంగీకరించడం పట్ల ప్రపంచ దేశాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

  • ఎస్‌. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్‌, 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News