ఆధునిక సౌకర్యాలతో సర్కారు బడులను తీర్చి దిద్దడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాల్లో వేగవంతం లేకపోవడంతో నూతన సాంకేతిక విప్లవం పిల్లలకు పూర్తిస్థాయిలో చేరువకాలేదు. మౌలిక వసతులు కల్పించి సాంకేతిక సొబగులతో ప్రభుత్వ పాఠశాల విద్య లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ), రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ టచ్ స్క్రీన్ టీవీ బోధనతో ఆధునీకరించే లక్ష్యంతో ’మన ఊరు- మన బడి’ పథకంను రూపొందించాయి. ఇందులో భాగంగా వర్చువల్ రియాలిటీ (వీఆర్) ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా విద్యా ర్థులకు 3డీ పాఠశాలను చూపించాలన్న విద్యాశాఖ నిర్ణయం కాగితాలకే పరిమితమైంది. పీఎంశ్రీ పథకానికి దేశవ్యాప్తంగా 14,500, తెలంగాణ నుంచి 1,200 బడు లను అధికారులు ప్రతిపాదించారు. ఆహ్లాదకర వాతావరణం, ఆధునిక పద్ధతుల్లో బోధన ద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చనేది కేంద్రం యోచన. గ్రామస్థాయి విద్యార్థులకు జాతీయస్థాయి విద్యాప్రమాణాలను అందుబాటులోకి తేవచ్చని, విద్యార్థుల ప్రతిభను మెరుగుపెట్టవచ్చునని, ఉపాధి మార్గాలను ప్రాథమిక దశలోనే పునాదులు వేయవచ్చునని భావించింది. ఈ పథకం కింద ఎంపికైన బడులకు సొంత భవనాలు, మరుగుదొడ్లు, డిజిటల్ గ్రంథాలయాలు, సౌరవిద్యుత్, కాయగూరల తోట, శుద్ధజలం, ఐటీ ల్యాబ్, క్రీడా సౌకర్యం, నాణ్యమైన విద్య వంటి ఏర్పాట్లు లక్ష్యంగా ఎంచుకుంది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, వృత్తి విద్యా కోర్సులు, నైపుణ్యాభివృద్ధి చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈమేరకు నిధులను కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిగా కేటాయించారు. అయి తే ఈ పథకం కింద ఎంపికైన బడుల ప్రగతి, మెరుగైన ఫలితాల పట్ల పర్యవేక్షణ బాధ్యత మాత్రం కేంద్ర విద్యా శాఖది. జాతీయ విద్యావిధానం-2020కి అనుగుణంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు.
పీఎంశ్రీ పాఠశాలల్లో డిజటలైజేషన్లో భాగంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి, క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా అన్ని ప్రాంతాల నుంచి ఫ్యాకల్టీని అందుబాటులోకి తేవాలన్నది కేంద్ర విద్యాశాఖ ఆలోచన. దీనివల్ల గ్రామస్థాయి విద్యా ర్థులకు జాతీయస్థాయి విద్యాప్రమాణాలు అందుతాయని భావించింది. సైన్స్ సబ్జెక్టుల్లో ప్రయోగాలు, సోషల్లో భౌగో ళిక స్థితిగతులు వర్చువల్ రియాలిటీలో విద్యార్థులకు అవ గాహన కల్పించాలని అధికారులు భావించారు. మొక్క ఆవిర్భావం దగ్గర్నుంచి, దాని ఎదుగుదల దశలను వర్చువల్ విధానంలో విద్యార్థి తరగతి గదినుంచే తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. గ్రహాలు, సూర్య, చంద్ర మండలాల్లో మార్పులను ఆధునిక సాంకేతికతతో అర్థమయ్యేలా చెబుతారు. ఇందుకు అవసరమయ్యే వీఆర్ ల్యాబ్ల ఏర్పాటుకు కేంద్ర విద్యాశాఖ అంగీకరించి ఏడాదిన్నర దాటినా ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. విద్యార్థులు పాఠ్యాంశాలను ప్రత్యక్షంగా చూస్తే జీవితాంతం మరిచిపోకుండా ఉంటారన్న భావనతో 3డీ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావాలని విద్యాశాఖ భావించింది. ఈ ల్యాబ్ల వల్ల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు, చదువుపై ఉత్సుకత పెరుగుదలను బట్టి దశలవారిగా పాఠశాలల సంఖ్యను పెంచాలన్నది లక్ష్యం. కానీ, అసలు నిర్ణయం కార్యరూపమే దాల్చలేదు. డిల్లీలోని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) కార్యాలయంలోని వీఆర్ ల్యాబ్ తరహాలో గత విద్యాసంవత్సరం (2023-24)లో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొల్పడానికి కేంద్ర విద్యాశాఖకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు 2023 మార్చిలో జరిగిన సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆమోదిత మండలి సమావేశం ఆమోదం తెలిపింది. వీఆర్ ల్యాబ్ల ఏర్పాటుకు 60 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదించింది. దీంతో 2023 ఏప్రిల్లో ఐదు వీఆర్ ల్యాబ్ల ఏర్పాటుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానిం చారు. ఇప్పటికీ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా టెండర్ల పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో వీఆర్ ల్యాబ్ల సంగతి ఇలా ఉంటే, హైదరాజద్ నగరంలోని పలు ఇంట ర్నేషనల్ పాఠశాలల్లో మాత్రం 3డి పాఠాల కోసం వీఆర్ ల్యాబ్లను ఉపయోగిస్తున్నారు. ‘మన ఊరు – మన బడి’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలను ప్రభు త్వ ఉన్నత పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్ టచ్ స్క్రీన్ టీవీల ద్వారా బోధనకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్ ఎస్) సహాయంతో ఎంపిక చేసిన పాఠశాలలకు డిజిటల్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సైన్స్ లోని పాఠ్యాంశం బోధిస్తూ మానవుడి శరీరంలోని వివిధ అవయవాలు, వాటి పనితీరును గురించి ఉపాధ్యాయులు వివరిస్తారు. బ్లాక్ బోర్డుపై బొమ్మ గీస్తారు. కానీ, ఎలా పని చేస్తాయో చూపించలేరు. అదే డిజిటల్ తరగతుల్లో తెరపై ప్రత్యక్షంగా చూపిస్తే… విద్యార్థులకు బాగా గుర్తుంటుంది. తెరపై కదాలాడే విషయాలను విద్యార్థులు ఎంతో ఆసక్తితో చూసి గుర్తుపెట్టుకుంటారు. విద్యా బోధన దృశ్యరూపంలో ఉండే మరింత ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం గుర్తిం చింది. డిజిటల్ బోధనకు శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన పాఠశాలలకు రూ.10.58 లక్షల విలువైన 75 అంగుళాల పొడవైన ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పి) మూడు డిజిటల్ మానిటర్లు, 2 కేవీ యూపీఎస్లు, స్మార్ట్ క్లాస్లూంలో నాలుగు ట్యూబ్ లైట్లు, రెండు ఫ్యాన్లు, గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా లేకున్నా ఆరు గంటల పాటు పనిచేసేలా ఇన్వర్టర్లను సమకూర్చారు. డిజిటల్ పాఠాలను ప్రసారం చేస్తూనే దానికి ఇరువైపులా గ్రీన్ బోర్డుపై ఉపాధ్యాయులు రాస్తూ వివరించవచ్చు. ఐఎఫ్పీలో ముందుగానే ఆయా పాఠ్యాంశాలను అప్లోడ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. పెన్‌డ్రైవ్‌లోని పాఠ్యాంశాలను కూడా తెరపై చూపిస్తూ వివరించవచ్చు. తెర అవసరం లేదనుకుంటే దానిపై ఉండే స్లైడర్ (తలుపులాంటిది) లాగి మొత్తం గ్రీన్ చాక్ బోర్డును ఉపయోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుంచి లైవ్‌లో పాఠం బోధిస్తున్నా తరగతి గది నుంచే వినొచ్చు. నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించవచ్చు. ఈమేరకు డిజిటల్ బోధనకు ఆయా పాఠశాలల్లోని కొంతమంది ఉపాధ్యాకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇవి విద్యార్థులను ఎంతగానో ఆకట్టు కుంటున్నాయి.
ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అరచేతి లోకి వచ్చిన ఈ కాలాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిపుచ్చుకుని ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు అందు బాటులోకి తీసుకురావడం ఎంతైనా అవసరం. ఇప్పటికే తలపెట్టిన వర్చువల్ రియాలిటీ (వీఆర్) ల్యాబ్‌ల ఏర్పాటు విషయంలో జాప్యం చేయకుండా వినియోగంలోకి తేవాలి. 3డీ సినిమాల మాదిరిగానే పాఠ్యాంశాలను చూసి విద్యా ర్థులు అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. ప్రతిభ ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించగలుగుతారు.
కోడం పవనకుమార్, 9848992825