Tuesday, January 7, 2025
Homeనేరాలు-ఘోరాలుNirmal: వ్యవసాయ భూమిలో గంజాయి సాగు

Nirmal: వ్యవసాయ భూమిలో గంజాయి సాగు

దురాశతోనే

నిర్మల్ జిల్లా కడెం మండలంలో సాగుభూమిలో పెంచుతున్న గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఎస్పీ జానకి షర్మిల స్వయంగా దాడులు చేసి రూ.60 లక్షల విలువైన మొక్కలను ధ్వంసం చేశారు. ఆరుగురిని అరెస్టు చేశారు. వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేస్తే వచ్చే ఆదాయం తక్కువని, పంటతో పాటు పంట చేనులో గంజాయి మొక్కలు సాగిస్తే లక్షల లాభం గడించవచ్చునన్న దురాశతో నిందితులు తమ భూముల్లో గంజాయి పంటను సాగు చేస్తూ వచ్చారు.

- Advertisement -

రోడ్లు సరిగ్గా లేని ప్రాంతాల్లో సాగు

కడెం మండలం మంగల్ సింగ్ తాండాకు చెందిన టకాడ ఇందల్, కసావత్ సజన్ లాల్, గోతి రవీందర్, కచ్కద్ సంతోష్, బామానే సురేందర్, పేలియ ప్రతాప్ సింగ్ ఈ కేసులో ప్రధాన నిందితులు. వాహనాలు కూడా వెళ్ళలేని అరణ్యంలో రోడ్లు సరిగా లేని ప్రాంతాలలో గంజాయి సాగు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం తో జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల నేతృత్వంలో ప్రత్యేక టీం ఈ దాడుల్లో పాల్గొంది. ఆల్లంపల్లి, బాబానాయక్ తండా ప్రాంతాలలో ఎస్పి డా.జానకి షర్మిల తన సిబ్బందితో ద్విచక్ర వాహనంపై వెళ్లి కంది పత్తి పంటలలో అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించారు. ఈ ఘటనలో విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి.

ఈజీ మనీ కోసమే
సులభంగా డబ్బు సంపాదనతో పాటు తన అవసరాల కోసం కుటీర పరిశ్రమ తరహాలో నిందితులు తన పంట పొలంలో గంజాయి మొక్కల పెంపకం చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్పి నేతృత్వంలో ప్రత్యేక టీం వెళ్లి గంజాయి మొక్కలను గుర్తించి వాటి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్పి జానకి షర్మిల గ్రామస్తులతో మాట్లాడుతూ ఎవరైనా గంజాయి అమ్ముతున్నా, పండిస్తున్నా తక్షణమే 8712659555, 8712659599 సెల్ నంబర్లకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

ఈ ఉదంతంలో చాకచక్యంగా వ్యవహరించిన డిఎస్పీ ప్రభాకర్, ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదా రావు, కడెం ఎస్ఐ కృష్ణ సాగర్, ఆర్ఎస్ఐ రవి కుమార్, జిల్లా డాగ్ స్క్వాడ్ సిబ్బంది సాయి, సిబ్బంది తిరుపతి, గణేష్, సతీష్ లను, హెడ్ కానిస్తాబుల్ కైలాష్, కానిస్తాబుల్ భీం రావు, షారుక్, హోమ్ గార్డ్ అధికారులు శ్రీనివాస్, వెంకటేశ్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News