జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరివేత పనిలో భారత ఆర్మీ నిమగ్నమైంది. పహల్గాం దాడిలో(Pahalgam Terror Attack) పాల్గొన్న టెర్రరిస్టుల కోసం జల్లెడపడుతున్న భద్రతా దళాలకు బందీపొరాలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ ఆచూకీ తెలిసింది. దీంతో స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదుల ఆచూకీల లభించడంతో కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో అల్తాఫ్ ప్రాణాలు కోల్పోయాడు. అలాగే భద్రతా దళాల్లోని ఓ అధికారికి గాయాలయ్యాయి. భారత ఆర్మీ జనరల్ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్‌లో అడుగుపెట్టిన వేళ ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం.
పహల్గాంలో ఉగ్రదాడి వెనక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కశ్మీర్‌లో చురుగ్గా పనిచేస్తున్న మాడ్యూల్‌ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. ఇంటెలిజెన్స్ బృందాల అంచనాల ప్రకారం ఈ టెర్రరిస్టులకు సలహాలు, సూచనలు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మిలిటరీ నుంచి వచ్చేవని తెలిసింది.