కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatala Rajendar) స్పందించారు. తనకు ఇంకా నోటీసులు అందలేదని.. అందిన వెంటనే పార్టీ అనుమతి తీసుకుని స్పందిస్తానన్నారు. కేసీఆర్ (KCR) నిర్ణయాలు ఎలా ఉండేవో బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరికి తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఓసారి మంత్రివర్గ ఉపసంఘం వేశారని.. అందులో తనతో పాటు, తుమ్మల, కడియం, హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉన్నామని వివరించారు.
ఆ సమయంలో ఏం జరిగిందో త్వరలోనే మీడియాకు తెలియజేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణరావు ప్రస్తుత సీఎస్‌గా ఉన్నారని తెలిపారు. తనకు నోటీసులు ఇవ్వడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికే(CM Revanth Reddy) నష్టమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఇంజినీర్లే తాము ముఖ్యమంత్రి చెప్పినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని చెబుతుంటే ఇక తాము ఏం చెబుతామని ప్రశ్నించారు. కమిషన్ గడువు ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు.