Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Pakistan: కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న పాకిస్థాన్‌

Pakistan: కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ సహాయ సహకారాలతో పెట్రేగుతున్న ఉగ్రవాదానికి సంబంధించినంత వరకూ మొదటి బాధితురాలు భారతదేశమే. పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌లను కేంద్రంగా చేసుకుని ఈ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ భారత్‌పై పట్టు సాధించేందుకు గత మూడు దశాబ్దాల నుంచి విశ్వప్రయత్నం చేస్తోంది. మధ్య ప్రాచ్యం నుంచి కూడా ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్న మాట నిజమే. ఇక ఆగ్నేయాసియా, మధ్య ఆసియాలలో కూడా చెదురు మదురుగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయి కానీ, అవన్నీ వారి వారి దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అటు అఫ్ఘానిస్థాన్‌లోనూ, ఇటు పాకిస్థాన్‌లోనూ ఉగ్రవాదానికి, ఉగ్రవాదాలకు మద్దతు లేదా సహాయ సహకారాలు లభించడానికి కొన్ని కారణాలు తోడవుతున్నాయి. అవిః సారవంతమైన భూములు లేకపోవడం, భూస్వామ్య విధానాలు కొనసాగుతుండడం, విద్యా సౌకర్యాలు లోపించడంతో పాటు విద్యపట్ల తగినంత శ్రద్ధాసక్తులు లేకపోవడం, ఉద్యోగావకాశాలు అంతంత మాత్రంగా ఉండడం, కొన్ని ప్రాంతాలు, కొన్ని వర్గాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి అవకాశాలు ఉండడం, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోవడం, విప్లవాత్మక, హింసాత్మక సిద్ధాంతాలకు ఆకర్షితులు కావడం.
ఒక విధంగా చూస్తే, పాకిస్థాన్‌ కూడా ప్రస్తుతం ఉగ్రవాద ధోరణుల బాధితురాలిగా మారిపోతోంది. 2007లో పాకిస్థాన్‌ సైన్యం లాల్‌ మస్జిద్‌ విషయంలో జోక్యం చేసుకున్నప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద ధోరణులు పేట్రేగడం ప్రారంభమైంది.దేశంలో విప్లవాత్మక, హింసాత్మక ధోరణులు పెరగకుండా ఉండేందుకు అప్పటి అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషరఫ్‌ఈ లాల్‌ మస్జిద్‌ వద్ద సైన్యాన్ని కేంద్రీకృతం చేయడం జరిగింది. ఆ సమయంలో టెహ్రీక్‌-ఎ-తాలిబాన్‌-ఎ-పాకిస్థాన్‌ అనే ఉగ్రవాద సంస్థ పుట్టుకొచ్చింది. పాకిస్థాన్‌ సైన్యానికి వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థలు, వర్గాలన్నీ కలిసి ఈ టి.టి.పి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ప్రధాన ఆశయాలేవంటే, ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఆదివాసీ ప్రాంతాలపై ప్రభుత్వ అదుపును తగ్గించడం, వాటితో పాటు ఆ పొరుగునే ఉన్న ఖైబర్‌ ఫక్తూన్‌క్వా ప్రాంతాన్ని కూడా పాకిస్థాన్‌ నుంచి తప్పించడం, పాకిస్థాన్‌ వ్యాప్తంగా షరియాను కఠినంగా అమలు చేయడం. ఇవన్నీ పైకి చెప్పే ఆశయాలు. కాగా, అసలు పాకిస్థాన్‌ ప్రభుత్వానే కూలదోయడం అంతర్గత ఆశయంగా కనిపిస్తోంది. పాకిస్థాన్‌లో పూర్తి స్థాయి ఖలీఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది ఈ టి.టి.పి ప్రధాన లక్ష్యం.
దాడులు, ప్రతిదాడులు
కరాచీ విమానాశ్రయం మీద టి.టి.పి దాడి చేసిన తర్వాత, 2014-18 మధ్య కాలంలో పాకిస్థాన్‌ సైన్యం ఆపరేషన్‌ జర్బ్‌-ఎ-అజబ్‌ పేరిట టి.టి.పి శ్రేణుల మీద అనేక పర్యాయాలు దాడులు నిర్వహించింది.ఇక 2015 డిసెంబర్‌లో టి.టి.పి పాకిస్థాన్‌ సైన్యం మీద ప్రత్యక్ష దాడులకు నడుం బిగించింది. ఇందులో భాగంగా పెషావర్‌లో ఉన్న పాకిస్థాన్‌ సైనిక స్కూల్‌ మీద బాంబులతో దాడులు చేసి, 133 మంది విద్యార్థులను బలి తీసుకుంది. ఈ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మాదిరిగా భారత్‌ మీద దృష్టి పెట్టకుండా పూర్తిగా పాకిస్థాన్‌ ప్రభుత్వం మీదే తన శక్తి సామర్థాలను కేంద్రీకరించింది. అమెరికా మీద అఫ్ఘాన్‌ తాలిబాన్‌ల విజయం తర్వాత ఆ ప్రాంతంలోని ఇస్లామిక్‌ ఉగ్రవాద వర్గాలన్నిటికీ బలం పెరిగిపోయింది. నిజానికి, కొన్ని ఉగ్రవాద సంస్థలు ముఖ్యంగా ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐ.ఎస్‌) 2018లోనే సిరియా, ఫిలిప్పీన్స్‌ నుంచి నిష్క్రమించాల్సింది.అంతేకాదు, ఈ ఐ.ఎస్‌ సంస్థ ఖొరసాన్‌ ప్రాంతంలో చిన్న స్థాయిలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉంది. ఇందుకు కొద్ది మంది ఉగ్రవాదుల నుంచి మద్దతు, ప్రోత్సాహం కూడా లభించాయి. టి.టి.పి మీద పాకిస్థాన్‌ సైన్యం విజయం సాధించడంతో టి.టి.పి అఫ్ఘానిస్థాన్‌కి వెళ్లి తలదాచుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో అఫ్ఘానిస్థాన్‌ నుంచి అమెరికా2021 ఆగస్టులో నిష్క్రమించడంతో మళ్లీ ఈ వర్గాలన్నిటికీ బలం చేకూరింది.తాలిబాన్ల నియంత్రణతో సంబంధం లేకుండా అనేక వర్గాలు అఫ్ఘానిస్థాన్‌ లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ప్రారంభించాయి.
అఫ్ఘాన్‌లో తాలిబాన్‌ల విజయాన్ని పాకిస్థాన్‌ వేడుకగా జరుపుకుంది. అయితే, తాము పాముకు పాలు పోస్తున్న విషయాన్ని అది గ్రహించలేకపోయింది. అంతవరకూ సడీ చప్పుడూ లేకుండా ఉన్న టి.టి.పి శ్రేణులు ఒక్కసారిగా విజృంభించి, పాకిస్థాన్‌లోకి చొరబడడం ప్రారంభించాయి. గత కొద్ది నెలలుగా పాకిస్థాన్‌ సైన్యం పైనా, పౌరుల పైనా వీరి దాడులు మరీ ఎక్కువయ్యాయి. పాకిస్థాన్‌ సైన్యాన్ని ఓడించడం చాలా తేలిక అన్న భావన వీరిలో పెరిగిపోయింది. అది పాకిస్థాన్‌ నుంచే కాక, ప్రధాన తాలిబాన్‌ వర్గాలతో కలిసి అఫ్ఘానిస్థాన్‌ నుంచి కూడా పాకిస్థాన్‌ సైన్యంపై దాడులు సాగిస్తున్నాయి. ప్రధాన తాలిబాన్‌ వర్గం జోక్యం చేసుకుని పాకిస్థాన్‌ సైనికాధికారులకు, టి.టి.పి నాయకుల మధ్య సంధి కుదర్చి, 2021 ప్రారంభంలో కాల్పుల విరమణకు అవకాశం కల్పించింది.అయితే, 2021 డిసెంబర్‌లో కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత టి.టి.పి మరింత విజృంభించింది.పాకిస్థాన్‌ జైళ్లలో ఉన్న తమ వంద మంది నాయకులను విడుదల చేయాల్సిందిగా టి.టి.పి షరతు పెట్టింది. అయితే, పాకిస్థాన్‌ సైన్యం ఇద్దరు ముగ్గురిని మాత్రమే విడుదల చేసింది.
అలవికాని షరతులు
వందమందిని విడుదల చేయాలన్న పక్షంలో దేశవ్యాప్త కాల్పుల విరమణను ప్రకటించాలని పాకిస్థాన్‌ సైన్యం డిమాండ్‌ చేయగా, ఆదివాసీలు ఉన్న ప్రాంతాలలో షరియాను అమలు చేయడానికి అవకాశం కల్పించాల్సిందిగా టి.టి.పి డిమాండ్‌ చేసింది. అవేమీ జరగకపోవడంతో, ఆ తర్వాత నుంచి టి.టి.పితో పాటు ఐ.ఎస్‌ గ్రూపు కూడా అడపా దడపా హింసా విధ్వంసకాండలకు పాల్పడుతూనే ఉంది. ఈ రెండింటి మధ్యా పెద్దగా సహకారమేమీ లేదు కానీ, భవిష్యత్తులో సహకారం ఉండదని ఆశించలేం. అయితే, టి.టి.పి మీద దాడులు చేయడాన్ని పాకిస్థాన్‌ సైన్యం బాగా తగ్గించింది. ఈ ఉగ్రవాద వర్గాలతో తాము చర్చలు జరపబోతున్నట్టు గత 13వ తేదీన ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఇక నుంచి అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించబోతున్నట్టు కూడా ఆయన తెలిపారు.
ఇది ఇలా ఉండగా, పాకిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఉగ్రవాద కార్యకలాపాలు పేట్రేగుతున్నాయిని అనేక అంతర్జాతీయ సంస్థలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్థికంగా దుర్భర పరిస్థితుల్లో ఉన్న పాకిస్థాన్‌కు సహాయం అందాలన్న పక్షంలో ఈ ఉగ్రవాద ముద్ర నుంచి బయటపడాల్సి ఉంది. అందువల్ల పాకిస్థాన్‌ ప్రభుత్వం, పాకిస్థాన్‌ సైన్యం దాడులకు దూరంగా ఉంటూ చర్చలకు ఆహ్వానించడం జరుగుతోంది. కాగా, టి.టి.పి గానీ, అఫ్ఘాన్‌ తాలిబాన్‌ వర్గం గానీ ప్రస్తుతానికి భారత్‌పై దృష్టి పెట్టడం లేదు. భారత్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద వర్గాల సహాయంతో టి.టి.పిని అణగదొక్కాలని పాక్‌ సైన్యం ఆలోచిస్తోంది. తాము భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం లేదని అంతర్జాతీయ సంస్థలకు తెలియజేయడం కూడా పాక్‌ ఉద్దేశం. అయితే, ఇప్పటికే అనేక విధాలుగా తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్న పాకిస్థాన్‌ ఇప్పుడు కొత్త పథకాలతో, కొత్త లక్ష్యాలతో ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

- Advertisement -

డాక్టర్‌ వి.ఎన్‌.ఎస్‌. ఆచార్య

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News