నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు అధికారులు అప్రమత్తతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో అన్ని జిల్లాల పోలీస్ అధికారులతో హోం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ,డి జి పి అంజనీ కుమార్ తదితర అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతోనూ, పోలీస్ కమిషనర్లతోను మాట్లాడారు. వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే అన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు వ్యవసాయ శాఖ, ఇంటెలిజెన్స్ సిబ్బందితో సమాచారం సేకరించి నకిలీ విత్తన విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలని హోం మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు ప్రయోజన పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ రుణాలు వంటి సంక్షేమ పథకాల ద్వారా రైతుల జీవితాలలో వెలుగులు నింపుతున్న తరుణంలో వారు నకిలీ విత్తనాల విక్రయ దారుల బారిన పడకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఎన్నో విజయాలను సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఈ విషయంలోనూ పోలీసు అధికారులు వ్యవహరించి నకిలీ విత్తనాలను అరికట్టాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల మేరకు రాష్ట్రంలోని రైతులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను హోం మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నకిలీ విత్తనాలు అమ్మకాలపై 986 కేసులను నమోదు చేశామన్నారు.వీటికి సంబంధించి 1938 నిందితులను అరెస్ట్ చేశామని, 58 మందిపై పి డి ఆక్ట్ బుక్ చేశామని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల విక్రయిదారులపై పి డి ఆక్ట్ ప్రకారం చర్యలు తీసుకున్నట్లయితే వారిని నియంత్రించవచ్చని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు నిరంతర అప్రమత్తత అవసరం అన్నారు .అదేవిధంగా, మద్యం ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ పట్ల అత్యంత శ్రద్ధ కనపరుస్తుందని ఈ నేపథ్యంలో వారికి నష్టం కలుగజేసే నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కన్నా ప్రస్తుత పరిస్థితిలో మార్పు వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో నియంత్రించాలన్నారు.రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల ఈ రకమైన నేరాలు తగ్గుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చొరవ చూపాలన్నారు. రైతులను మోసం చేసే వారిపై చర్యలు తీసుకోవడం ద్వారా సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జిల్లాల ఎస్పీలకు, కమిషనర్లకు అవసరమైన సూచనలను డిజిపి అంజనీ కుమార్ అందించారు. డిఐజి కార్తికేయ మద్యం సరిహద్దు జిల్లాల నుండి ఏ విధంగా వస్తుందో వివరించారు. ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై నిఘా ఉంచాలని సూచించారు. అడిషనల్ డిజిపి సంజయ్ కుమార్ జైన్, ఐజిపి షాన్వాజ్ ఖాసిం, ఎస్పీలు విజయకుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Hyd: పోలీసులూ.. నకిలీ విత్తనాలపై విరుచుకుపడండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES