జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ఆదేశాల మేరకు శాంతిభద్రతల పై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కర్నూలు సబ్ డివిజన్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు బృందాలుగా ఏర్పడి తెల్లవారుజామున కర్నూలు డిఎస్పీ విజయశేఖర్ సమక్షంలో కర్నూలు తాలుకా సిఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో పసుపుల గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పసుపుల గ్రామ ప్రజలతో కర్నూలు పట్టణ డిఎస్పీ మాట్లాడారు. నాటు సారా తయారీ దారులపై నిరంతర నిఘా ఉంచుతామన్నారు. ఈ దాడులు మరింత ముమ్మరం చేస్తామన్నారు.
నాటుసారా తయారీ , విక్రయం దారులు నాటు సారా జోలికి పోకూడదని, ఏవరైనా చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులలో 1200 లీటర్ల నాటు సారా ఊటను ధ్వంసం చేశారు. సరైన ధృవ పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలు, 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో కర్నూలు తాలుకా సిఐ శ్రీరామ్ , ఎస్సైలు బాల నరసింహా, రామకృష్ణ, 50 మంది పోలీసు, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు పాల్గొన్నారు.