Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Intellectuals silent in Rajya Sabha: పెద్దల సభలో మౌన మేధావులు

Intellectuals silent in Rajya Sabha: పెద్దల సభలో మౌన మేధావులు

రాజకీయ పునరావాస కేంద్రంగా పెద్దల సభ

రాజ్యసభకు ప్రముఖులను ఎంపిక చేయడం వల్ల ఆశించిన ఫలితమేమీ ఉండడం లేదు. గత అయిదున్నర దశాబ్దాల కాలంలో వందలాది మందిని ఎంపిక చేసినప్పటికీ సినీ ప్రముఖులు గానీ, క్రికెటర్లు గానీ, ఇతర ప్రముఖులు, మేధావుల కానీ దాదాపు 90 శాతం మంది ఒక్క రోజు కూడా తమ రంగాలకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించిన పాపాన పోలేదు. పైగా రాజ్యసభకు వారు హాజరు కావడం కూడా అతి తక్కువ. రాజ్యసభకు ప్రజా ప్రతినిధిగా నామినేట్ చేసినంత మాత్రాన వారు ప్రజా సేవకులయిపోయే అవకాశం లేదు. రాజ్యసభకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను, మేధావులను నామినేట్ చేయడం అనేది అనేక సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నదే. పెద్దల సభగా గుర్తింపు పొందిన రాజ్యసభకు ఇటువంటి సభ్యుల నామినేషన్ వల్ల కొద్దో గొప్పో పెద్దరికం లభిస్తుందనే ఉద్దేశంతో వీరిని సభ్యులుగా చేయడం జరుగుతోంది. సైద్ధాంతికత, భావ సారూప్యత, ప్రజాకర్షణ, కులాలు, వర్గాలను బట్టి రాజ్యసభకు ప్రముఖులను లేదా మేధావులను నామినేట్ చేయడం కూడా చాలా కాలం క్రితమే ప్రారంభమైపోయింది. అయితే, గత 70 ఏళ్ల కాలంలో ఈ విధంగా నామినేట్ చేసే ప్రక్రియతో పాటు, ఆ సభ్యుల వ్యవహారశైలి, రాజ్యసభ స్వరూప స్వభావాలు గణనీయంగా మార్పులకు లోనయిన మాట నిజం. మిగిలిన విషయాలను తాత్కాలికంగా పక్కనపెట్టి, నామినేటెడ్ సభ్యుల తీరుతెన్నులు, వ్యవహార శైలి విషయానికి వస్తే, వారు రాజ్యసభ సమావేశాలకు గైర్హాజర్ అవుతుండడమో, రాజ్యసభకు హాజరయినా ఏ చర్చ మీదా, ఏ కార్యక్రమం మీదా ఆసక్తి కనబరచకపోవడమో, ఎక్కడో వెనక కూర్చుని కాలక్షేపం చేయడమో ఎక్కువగా జరుగుతోంది.

- Advertisement -

గతవారం నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యారంగానికి విశేష సేవలు అందజేసినందుకు గాను ప్రైవేట్ రంగంలో చండీగఢ్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన సత్నామ్ సింగ్ అనే విద్యావేత్తను రాజ్యసభకు నామినేట్ చేసింది. అతి సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన సత్నామ్ సింగ్ క్రమంగా ఒక వ్యవస్థాపకుడుగా ఎదిగారు. పేదరికంలో పుట్టి లేదా సామాన్యమైన సామాజిక, ఆర్థిక నేపథ్యం కలిగి ఉండి, ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్న వ్యక్తులకు, నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న వ్యక్తులకు జాతీయ స్థాయి గుర్తింపునివ్వాలనే సదుద్దేశంతో మోదీ ఇటువంటి వ్యక్తులను ఎంపిక చేస్తుంటారనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమకు సైద్ధాంతికంగా అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేది. మోదీ మాత్రం అనేక గుర్రాల మీద స్వారీ చేస్తున్నారు. సైద్ధాంతికంగా తమతో సారూప్యం లేకపోయినా పరవాలేదు. తటస్థంగా ఉన్నా పరవాలేదు. అజ్ఞాత వ్యక్తి అయినా పరవాలేదు. అటువంటి వ్యక్తుల్ని రాజ్యసభ సభ్యులను చేసి వారిని అందలాలు ఎక్కించడం జరుగుతోంది.

నోరెత్తితే ఒట్టు
అయితే, మెరిసేదంతా బంగారం కాదనే నానుడి ఇక్కడ అతికినట్టు సరిపోతోంది. 1952 నుంచి రాజ్యసభకు సినిమా ప్రపంచం నుంచి ఎవరో ఒకరిని నామినేట్ చేయడం జరుగుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 143 మంది సినిమా ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. ఇందులో 24 మందిని రెండవ పర్యాయం కూడా నామినేట్ చేశారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో అంతర్లీనంగా కనిపించే అంశమేమిటంటే, ఇందులో ఎక్కువ మందికి ప్రభుత్వ పెద్దలతో, ముఖ్యంగా ప్రధానమంత్రితో సత్సంబంధాలు ఉండడమే వారు రాజ్యసభకు నామినేట్ కావడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు మొత్తం 67 మందిని రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేయగా, మన్మోహన్ సింగ్ 19 మందిని నామినేట్ చేశారు. మొత్తం 14 మంది ప్రధానమంత్రులూ ఎంతోమంది సినిమా ప్రముఖులను నామినేట్ జరిగింది కానీ, వీరిలో ఎవరూ ఏ సందర్భంలోనూ తమ ప్రతిభను ప్రదర్శించడం జరగలేదు. తమ మూడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు 65 మందిని నామినేట్ చేశాయి. రాజీవ్ గాంధీ తన అయిదేళ్ల పాలనలో 12 మంది ప్రముఖులకు అవకాశమిచ్చారు.

నిజానికి, ప్రధానమంత్రులందరూ తమకు అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే రాజ్యసభ సభ్యత్వం కల్పించారనుకుంటే పొరపాటే. నెహ్రూ వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను మొదటి సారిగా నామినేట్ చేశారు. జాకీర్ హుసేన్ (విద్యావేత్త), అల్లాడి కృష్ణస్వామి (న్యాయ నిపుణుడు), సత్యేంద్రనాథ్ బోస్ (శాస్త్రవేత్త), రుక్మిణీ దేవి అరండేల్ (కళాకారణి), కాకాసాహేబ్ కాలేల్కర్ (పరిశోధకుడు), మైథిలీ శరణ్ గుప్తా (కవి), పృథ్వీరాజ్ కపూర్ (నటుడు). రాజ్యసభకు ఈ ప్రముఖులను నామినేట్ చేస్తూ నెహ్రూ, ‘‘వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడం జరిగింది. వీరు తమ తమ రంగాలకు చెందిన సాధక బాధకాలను సభలో ప్రముఖంగా చర్చకు తీసుకు రావడం జరుగుతుంది. వీరు ఇతర సభ్యులను కలుపుకుని పోతూ, ప్రజా ప్రతినిధులుగా వ్యవహరిస్తారనే నేను భావిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు.

ప్రతినిధులేనా వీరంతా?
వీరు రాజ్యసభలో ఎన్ని చర్చల్లో పాల్గొన్నారో తెలుసుకోవడానికి ఎక్కడా రికార్డులు లేవు కానీ, వీరెవరూ చర్చల్లో పాల్గొనలేదనే అర్థమవుతోంది. నామినేట్ అయిన తర్వాత పృథ్వీరాజ్ కపూర్ మొదటిసారి (ఒకే ఒకసారి) రాజ్యసభలో మాట్లాడుతూ, ‘‘మేము రాజకీయాల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడడం ప్రారంభిస్తే మా మీద అపవాదులు పడడమే కాకుండా, మా జనాకర్షణకు గ్రహణం పట్టినట్టు అవుతుంది. అసలు మేము రాజ్యసభలో కనిపించడమే మా రంగానికి కొండంత అండ అవుతుంది’’ అని స్పష్టం చేశారు. మొదటిసారిగా తాము నామినేట్ చేసిన సభ్యులు వామపక్ష ఉదారవాదానికి, అంతర్జాతీయవాదానికి అనుకూలంగా ఉండాలని మాత్రమే నెహ్రూ ఆశించారు. అంతేకాదు, ఆయన ఎక్కువగా సోషలిస్టులను, శాస్త్రవేత్తలను, విద్యావేత్తలను మాత్రమే రాజ్యసభకు ఎంపిక చేసేవారు. ఇందిరా గాంధీ జనాకర్షణతో పాటు, తమకు వీలైనంతగా భజన చేసేవారిని ఎంపిక చేసేవారు.

ఇందిరా గాంధీ తర్వాత పి.వి. నరసింహారావు కూడా ఎక్కువగా సినిమా ప్రముఖులనే ఎంపిక చేయడం జరిగింది. ఆయన వైజయంతి మాలను ఎంపిక చేశారు. ఐ.కె. గుజ్రాల్ ఇక షబానా ఆజ్మీని ఎంపిక చేశారు. వాజ్ పేయి ప్రధాని అయిన తర్వాత పరిస్థితిలో కొద్దిగా మార్పు వచ్చింది. ఆయన సినిమా ప్రముఖులను నామినేట్ చేశారు కానీ, ఇతర రంగాలకు చెందిన వారిని కూడా ఎంపిక చేశారు. హేమమాలిని, దారాసింగ్, లతా మంగేష్కర్ లకు ఆయన హయాంలోనే రాజ్యసభ సభ్యత్వం లభించింది. బిమల్ జలాన్, ఫాలీ నారిమన్ లను కూడా ఆయన ఎంపిక చేయడం జరిగింది. ఈ ఇద్దరూ రాజ్యసభ చర్చల్లో పాల్గొనడమే కాకుండా అనేక విధాలుగా తమ సేవలు అందించడం కూడా జరిగింది.

పునరావాస కేంద్రం
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారమంతా మరింతగా మారిపోయింది. ఆయన పి.టి. ఉష, మారీకోమ్, సురేశ్ గోపి, రూపా గంగూలీ, ఇళయ రాజా వంటి ప్రముఖులతో పాటు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంజన్ గొగోయ్ ని కూడా రాజ్యసభ సభ్యుడిని చేశారు. విచిత్రమేమిటంటే, ఈ రాజ్యసభ సభ్యులెవరూ సభలో గొంతెత్తిన పాపాన పోలేదు. గొగోయ్ కూడా అప్పుడప్పుడూ రాజ్యసభకు హాజరయ్యేవారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నామినేట్ చేసిన సభ్యులంతా కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ఉపయోగపడ్డారు కానీ, బీజేపీ ప్రభుత్వం నియమించినవారెవరూ ఆ పార్టీకి ఉపయోగపడిన దాఖలాలు లేవు. అశోకా విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం, 1952 నుంచి వివిధ ప్రభుత్వాలు నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యులలో 99 శాతం మంది సభలో నోరెత్తడమే జరగలేదు. చాలామంది సభకు హాజరు కాకపోవడం గానీ, వెనుక వైపున కూర్చుని వెళ్లిపోవడం గానీ జరుగుతోంది. సచిన్ టెండూల్కర్ హాజరు కూడా 22 శాతమే. ఆయన ఏనాడూ ఏ చర్చలోనూ పాల్గొనలేదు. అంతేకాదు, ఈ సభ్యులెవరూ తమకు సంక్షేమ కార్యక్రమాల కోసం ఇచ్చిన నిధులను కూడా ఖర్చు చేయలేదు.

మొత్తం మీద రాజ్యసభకు రాజకీయేతర ప్రముఖులను నియమించడం అనే సదుద్దేశం నెరవేరనే లేదు. నిజానికి వారంతా దేశంలోనే కాక, అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులున్నవారు. రాజకీయేతర ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేయాలన్న రాజ్యాంగ విధి విధానాలను పునఃపరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. రాజకీయేతర ప్రముఖులను (పెద్దలను) రాజ్యసభకు నామినేట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగమూ కనిపించడం లేదు. వీరి కారణంగా రాజ్యసభ ప్రాధాన్యం కూడా అడుగంటిపోతోందనే అభిప్రాయం కూడా ఉంది. రాజ్యసభ అనేది వీరికి పునరావాస కేంద్రం కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇందులోని సభ్యులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ, దేశానికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. రాజ్యసభను దుర్వినియోగం చేయడం దీర్ఘకాలంలో దేశానికి ఎంతో చెరుపు చేస్తుంది.

– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News