అనేక సంవత్సరాలుగా రాయబరేలీ లోక్ సభ స్థానం నుంచి గెలుస్తూ వస్తున్న కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఈసారి అకస్మాత్తుగా రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేయడం దేశంలో సంచలనం సృష్టిస్తోంది. తాను ఇక రాయబరేలీ నుంచి పోటీ చేసినా ప్రయోజనం ఉండదని ఆమె అనుకున్నారా లేక దీనికి మరేదైనా కారణం ఉందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. పార్లమెంటులో ప్రవేశించడానికి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభ స్థానాన్ని ఎంచుకున్నారు. ఎనిమిది నెలల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలికి తమ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేయాల్సిందిగా అభ్యర్థించారు. నిజానికి, ఆమె ఇంతవరకూ ఏ ఎన్నికల్లోనూ పరాజయంపాలు కాలేదు. 1999లో కాంగ్రెస్ అధికార పగ్గాలను చేపట్టిన నాటి నుంచి ఆమె అమేథీ లేదా బళ్లారి స్థానాల నుంచి కూడా లోక్ సభకు ఎన్నికవడం జరిగింది. 2004, 2009, 2014, 2019లలో ఆమె రాయబరేలీ నుంచి ఎన్నిక కావడం జరిగింది. కాగా, సిద్దరామయ్య ఆహ్వానాన్ని ఆమె ఎంతో సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది కానీ, ఆమె చివరకు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడానికే సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎ.ఐ.సి.సి అధ్యక్షుడుగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక నుంచే రాజ్యసభకు ఎంపికయ్యారు. పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడు నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నిక కావడం జరిగింది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రధాన నాయకులైన సోనియా, రాహుల్ గాంధీలు ఉత్తర ప్రదేశ్ ను విడిచిపెట్టినట్టయింది.
ప్రస్తుతం అందరి కళ్లూ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ మీద కేంద్రీకృతమయ్యాయి. ఆమె రాయబరేలీ నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆమెకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే, చివరి క్షణంలో అభిషేక్ మనూ సింఘ్వీ ఇక్కడికి నామినేషన్ వేశారు. ఆనంద్ శర్మకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ అవకాశమిచ్చినా అధిష్ఠానం అందుకు అంగీకరించలేదు. విచిత్రమేమింటే, చాలామంది కాంగ్రెస్ నాయకులు రాజస్థాన్ నుంచే పోటీ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో ఎక్కువ మంది రాజస్థాన్ కు చెందిన వారే కావడం గమనించాల్సిన విషయం. ప్రతి ఆరుగురు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుల్లో అయిదుగురు రాజస్థాన్ నుంచే ఎన్నిక కావడం జరుగుతోంది. ఈసారి కూడా ఆరుగురు సభ్యుల్లో రణదీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారి, కె.సి. వేణుగోపాల్, సోనియా గాంధీ రాజ్యసభకు నామినేషన్ వేశారు. వీరెవరూ రాజస్థాన్ కు చెందినవారు కాదు. ఇంతకూ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయడానికి కారణమేమిటి? జనపథ్ లోని తన పదవ నంబర్ నివాసాన్ని కాపాడుకోవడానికే ఆమె రాజ్యసభ ద్వారానైనా పార్లమెంటులో అడుగుపెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. 1989లో రాజీవ్ గాంధీ అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంటు సభ్యుడుగా ఈ నివాసంలోకి మొదటిసారిగా ప్రవేశించారు. రాజీవ్ గాంధీ హత్యకు గురైన తర్వాత కూడా సోనియా గాంధీ అదే నివాసంలో కొనసాగుతున్నారు. 2019 తర్వాత నుంచి ఆరోగ్యం బాగా లేనందువల్ల సోనియా గాంధీ తన రాయబరేలీ నియోజకవర్గాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. ఆమెకు తన నియోజక వర్గానికి వెళ్లడం కూడా కుదరడం లేదు. అందువల్ల ఈ పర్యాయం ఆమె రాయబరేలీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఆమె బదులుగా ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ ఆ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రియాంక గాంధీ రాయబరేలీ నుంచి లోక్ సభకు ఎన్నికైనప్పటికీ ఆమె జనపథ్ లోని 10వ నంబర్ నివాసంలో చేరే అవకాశం ఉండదు. అందువల్ల సోనియా గాంధీ ఈ నివాసాన్ని కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఈ నివాసం తమ వద్దే ఉండడానికి ఆమె రాజ్యసభ సభ్యత్వాన్ని
ఎంచుకున్నారు.