Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Telugu shithyam: సాహితీ సవ్యసాచి ముట్నూరి కృష్ణారావు

Telugu shithyam: సాహితీ సవ్యసాచి ముట్నూరి కృష్ణారావు

ఆంధ్ర భారతి పేరుతో సాహితీ సేవ

దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా, ఒక పత్రికా రచయితగా, పరిశోధకుడుగా, సాహితీ విమర్శకుడుగా కూడా ప్రసిద్ధి చెందిన ముట్నూరి కృష్ణారావు అటు సాహితీవేత్తలకే కాకుండా ఇటు పత్రికా రచయితలకు కూడా మార్గదర్శకుడయ్యారు. 1907 నుంచి 1945 వరకు ‘కృష్ణాపత్రిక’ను నిర్వహించిన కృష్ణారావు ప్రజల్లో దేశభక్తిని, జాతీయవాదాన్ని ప్రభోదిస్తూ అనేక వ్యాసాలు రాశారు. తెలుగు పత్రికా రంగానికి ఆద్యుడుగా గుర్తింపు పొందిన కృష్ణారావు కృష్ణా జిల్లా దివి తాలూకాలోని ముట్నూరు గ్రామంలో 1879లో జన్మించారు. మొదటి నుంచి స్వతంత్ర భావాలు కలిగిన కృష్ణారావు దేశ స్వాతంత్య్రం కోసం అవిశ్రాంతంగా పోరాటాలు జరిపారు. బందరు నోబుల్‌ కాలేజీలోనే ఎఫ్‌.ఎ పూర్తి చేసిన తర్వాత ఆయన బ్రహ్మ సమాజ్‌ లో చేరారు. తనకు కళాశాల చదువులో అధ్యాపకుడుగా వ్యవహరించిన రఘుపతి వెంకటరత్నం నాయుడు సిద్ధాంతాలకు, ఆశయాలకు ప్రభావితుడైన కృష్ణారావు ఆయన ప్రోద్బలంతోనే బ్రహ్మ సమాజ్‌ లో చేరడం జరిగింది. ఆ తర్వాత ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు కానీ, డిగ్రీని అసంపూర్తిగానే వదిలిపెట్టి, స్వాతంత్య్ర ఉద్యమంలో, రచనా వ్యాసంగంలో పూర్తి కాలం ప్రవేశించారు.
వందేమాతరం ఉద్యమంతో మరింత స్ఫూర్తి పొందిన ముట్నూరి కృష్ణారావు ఆ తర్వాత భోగరాజు పట్టాభి సీతారామయ్య సహకారంతో బ్రిటిష్‌ వారి మీద అనేక పోరాటాలు జరిపారు. ఆ తర్వాత బిపిన్‌ చంద్రపాల్‌ తో కలిసి దేశమంతా పర్యటించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు కానీ, పెద్ద కుమార్తె, కుమారుడు చిన్న వయసులోనే మరణించడం జరిగింది. రెండవ కుమార్తె కూడా చిన్నతనంలోనే వితంతువయ్యారు. ఈ కష్టనష్టాలను ఓర్చుకుంటూనే ఆయన ఒకపక్క దేశం కోసం పోరాడుతూ, మరొక పక్క దేశ ప్రజలకు ఉత్తేజం, స్ఫూర్తి కలిగించే వ్యాసాలు రాస్తూ పూర్తిగా ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. పేదరికాన్ని నిర్మూలించడానికి, అందరికీ చదువు అందడానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది.

- Advertisement -

ప్రజల ఆర్థిక స్థితిగతులతో పాటు, అవిద్యను దృష్టిలో పెట్టుకుని, బ్రిటిష్‌ పాలకుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఆయన కృష్ణాపత్రికలో వందలాది వ్యాసాలు రాయడం జరిగింది. ఆ వ్యాసాలతో వెలువరించిన సంపుటాలు ఇప్పటికీ ఎవరిలోనైనా దేశభక్తిని పెంపొందిస్తాయి. ఇక సాహితీ సేవ కోసం ఆయన ఆంధ్ర భారతి పేరుతో ఒక సంచికను కూడా నిర్వహించడం జరిగింది. ఈ సంచికలో ఆయన సాహిత్యం మీద అనేక విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. ఆయన వ్యాసాలు సాహితీవేత్తల్లో సైతం స్ఫూర్తి కలిగించి, వారిని స్వాతంత్య్ర ఉద్యమం దిశగా నడిపించాయి. పలువురు సాహితీవేత్తలు తమ రచనల్లో దేశభక్తిని, జాతీయ వాదాన్ని జోడించడానికి చాలావరకు ఆయన సాహితీ వ్యాసాలు, సాహితీ విమర్శలే కారణం. ఆయన తన పోరాటాల విషయంలో ఎక్కడా ఎప్పుడూ రాజీపడలేదు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అనేక కష్టనష్టాలను అనుభవిస్తున్నా, పేదరికంగా మగ్గాల్సి వస్తున్నా ఆయన దేశం పట్ల, సమాజం పట్ల, విద్యావ్యాప్తి పట్ల తనకున్న నిబద్దత నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేదు. 1945లో తుది శ్వాస విడిచే వరకూ ఆయన అవిశ్రాంతంగా తన కలం పోరాటాన్ని కొనసాగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News