Thursday, November 14, 2024
HomeదైవంIllanthakunta: అపర భద్రాద్రి ఇల్లంతకుంటలో సీతారాముల కల్యాణం

Illanthakunta: అపర భద్రాద్రి ఇల్లంతకుంటలో సీతారాముల కల్యాణం

బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

ఆపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 17న (బుధవారం) జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆలయ గోపురాలతో పాటు ప్రహరీ గోడ చుట్టు రంగులు వేయించి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గత సంవత్సరం సుమారు 90 వేల వరకు భక్తులు కల్యాణ వేడుకకు హాజరుకాగా ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
✳️కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి… ఆలయానికి ఉత్తరం దిక్కున ఉన్న కల్యాణ మండపం, రేకుల షెడ్ల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ మండపానికి ఒకవైపు కళ్యాణ దాతలకు మరోవైపు వివిఐపీలు, డోనర్లకు కేటాయించగా రేకుల షెడ్లు కింద మీడియా, సాధారణ భక్తులకు కళ్యాణాన్ని వీక్షించేందుకు అవకాశం కల్పించారు. భక్తులు రాములోరి కల్యాణాన్ని వీక్షించేందుకు ఆలయ ఆవరణలో ఐదు ఎల్ఈడి ప్రొజెక్టర్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీ కేడ్లు, పెండిల్స్, ఎండ వేడిమిని తట్టుకునేందుకు చలువ పందిళ్లను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు, వైద్యం, టాయిలెట్స్ లాంటి సదుపాయాలను కల్పించారు. భక్తులకు కోనేరు వద్ద జల్లు స్థానం ఏర్పాటుతో పాటు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు.
✳️ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న జిల్లా కలెక్టర్…

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలను అనుసరించి ఈ సారి జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు.
✳️ కళ్యాణానికి హాజరయ్య భక్తులకు అన్నదానం, మజ్జిగ పంపిణీ…
శ్రీ సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తులలో సుమారు 60 వేల మందికి జమ్మికుంట కాటన్ మిల్లర్స్, పారా బాయిల్డ్ రైస్ మిల్లర్స్, రా రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. గతంలో పలువురు దాతల చేయూతతో కళ్యాణానికి హాజరయ్యే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయగా ఈసారి కూడా దాతలు ముందుకు వచ్చి మజ్జిగ పంపిణీ చేయనున్నారు.

✳️భక్తులకు ప్రత్యేక బస్ సౌకర్యం…
శ్రీ సీతారాముల కల్యాణానికి హాజరయ్యే భక్తుల కోసం జమ్మికుంట నుండి ఇల్లందకుంట వరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
✳️300 మంది పోలీసులతో భారీ బందోబస్తు…
అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సుమారు లక్షకుపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో సిపి అభిషేక్ మహంతి 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయా నికి వచ్చే సరిహద్దులలోనే ట్రాఫిక్ నియంత్రించే చర్యలు తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా తగు ఏర్పాటు చేపట్టారు.

✳️ఆలయంలో జరిగే ముఖ్య కార్యక్రమాలు…
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 17న బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం, 18న గురువారం శ్రీ సీతారాముల పట్టాభిషేకం, 23న మంగళవారం సూర్య రథోత్సవం (చిన్న రథం) 24న బుధవారం రాత్రి చంద్ర రధోత్సవం ప్రారంభం( పెద్ద రథం), 25న గురువారం చంద్ర రధోత్సవం(పెద్ద రథం) ఊరేగింపు, 26న శుక్రవారం రాత్రి శ్రీ పుష్పయాగం (నాఖబలి).

✳️కల్యాణానికి సర్వం సిద్దం చేశాం…
కందుల సుధాకర్ ఆలయ కార్య నిర్వహణ అధికారి…..
బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఏ.చంద్రశేఖర్ పర్యవేక్షణలో శ్రీ సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం చేశాం. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వ హించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విఐపి పాసులను రద్దు చేయడం జరిగింది. కళ్యాణ మండపం ఆవరణలో ఐదు ఎల్ఈడి ప్రొజెక్టర్లను సైతం ఏర్పాటు చేసాం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నామని ఈవో వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News