శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గార్ల మండల వ్యాప్తంగా పలు ప్రధాన ఆలయాలలో కళ్యాణ శోభతో కళకళలాడింది. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పుట్టకోట కోదండ రామచంద్రస్వామి ఆలయంలో వర్తక సంఘం భవనం వెంకటేశ్వర స్వామి ఆలయం అంబేద్కర్ బజార్ రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకలో మంగళ వాయిద్యాల నడుమ పల్లకిలో సీతా సమేత రామచంద్రుడు లక్ష్మణ హనుమంతుని ఉత్సవ విగ్రహాలను కళ్యాణ మండపానికి తీసుకు వచ్చారు.
మాజీ సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ పరుచూరి కుటుంబరావు అత్తులూరి సత్యం వేమిశెట్టి శ్రీనివాస్ పుల్లఖండం వేణుగోపాల్ జస్వంత్ ఠాగూర్ కొలనుపాక శ్రీనివాస్ తాలూరి శంకరయ్య దంపతులు పీటల మీద కూర్చొని దేవత మూర్తులకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు పూలు పండ్లు పసుపు కుంకుమలు సమర్పించగా, వేద పండితులు కాండూరి లక్ష్మీనారాయణ చార్యులు చిదంబరం అచ్యుత్ ఆచార్యలు ఉత్సవ మూర్తులను సుగంధ ద్రవ్యాలు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లతో అభిషేకించి, నూతన పట్టు వస్త్రాలు ధరింపజేసి, పూలు-తులసి మాలతో అలంకరించారు.
సతీసమేతుడైన రామచంద్ర స్వాముల వార్లకు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్ఛారణాలతో కళ్యాణ తంతును అంగరంగ వైభవంగా నిర్వహించారు. విష్ణు స్వరూపుడైన శ్రీ రామునికి శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపమైన సీతమ్మ కన్యాదానం నిర్వహించారు. వేదమంత్రాల మధ్య శ్రీరాముడు సీతమ్మకు మంగళ సూత్రధారణ చేశాడు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, పానకంతో పాటుగా అన్నదానం చేశారు.
సాయంత్రం సీతారాముల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో గ్రామ పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. సీతా రామ లక్ష్మణ హనుమంతుని దివ్య మంగళ రూపాలను దర్శించుకుని భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు.
ఈ కార్యక్రమంలో పుల్లఖండం రమేష్ మహవీర్ జైన్ కమల్ కుమార్ అగర్వాల్ కందునూరి ఉపేందర్ విశాల్ ప్రవీణ్ రాకేష్ శ్రీధర్ గణేష్ కట్ట రమేష్ వెంకట్ శ్రీను సత్యం కోటేష్ లక్ష్మి నర్సు వెంకన్న అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.