ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్లో జరిగిన సమావేశంలో బీజేపీ శాసన సభా పక్ష నేతగా మోహన్ చరణ్ మాఝీని ఎన్నుకున్నారు బీజేపీ అధిష్ఠానం ఆయన పేరును ప్రకటించడంతో ఇప్పటివరకూ నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. బీజేపీ అధిష్ఠానం తరఫున పర్యవేక్షకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీదా ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం 5గంటలకు జనతా మైదానంలో జరగనుంది.
బీజేపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ చరణ్ మాఝీ గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 53ఏళ్ల మోహన్ మాఝీ ఒడిశా తొలి బిజెపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఆయనతోపాటు మరి కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. రెండున్నర దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని పాలించిన బిజూ జనతాదళ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన విషయం విదితమే. దాంతో 24 ఏళ్ల తర్వాత అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతోంది.