Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుKurnool: పని కావాలంటే చెయ్యితడపాల్సిందే

Kurnool: పని కావాలంటే చెయ్యితడపాల్సిందే

కొన్నేళ్లుగా హైటెక్ దందా

చిన్న మొత్తాల పొదుపు పథకం అదేనండీ రికరింగ్ డిపాజిట్ (అర్.డి) అంటే గుర్తుకు వచ్చేది పోస్టాఫీసు. ఈ కార్యాలయంలో జాతీయ పొదుపు రికరింగ్ డిపాజిట్ ఖాతా పథకం, ద్వారా చిన్న, పేద వర్గాల ప్రజలు వారి భవిష్యత్ అవసరాలను తీర్చడానికి చిన్న, చిన్న మొత్తాలను నెల నెలా ఈ పథకం ద్వారా పోస్టాఫీసులో పొదుపు చేస్తారు. ఈ పథకంలో పొదుపు చేయాలంటే ఎంపీకేబీవై (మహిళా ప్రధాన్ క్షేత్రీయ బచత్ యోజన) లైసెన్సు పొందిన ఏజెంట్ల ద్వారనే తపాలా కార్యాలయంలో నెలనెలా పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలు పదవ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి ప్రవేశపెట్టింది. ఈ పథకమే కొంతమంది కలెక్టరేట్ రెవిన్యూ ఉద్యోగులకు కాసులు కురిపిస్తుంది. అది ఎలాగంటారా తెలుసుకోవాలంటే…… ఈ వార్తను చదవాల్సిందే….

- Advertisement -

రెవిన్యూ శాఖే కీలకం..

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్ని శాఖలు ఉన్నా వాటిలో రెవిన్యూ శాఖే కీలకం. జిల్లా రెవెన్యూ కార్యాలయంలో ఏ నుండి హెచ్ వరకు సెక్షన్లు ఉన్నాయి. ఈ విభాగాలన్నింటికీ జిల్లా రెవిన్యూ అధికారి బాస్ వ్యవహరిస్తుంటాడు. రెవిన్యూ సెక్షన్లలో ఏ చిన్న సమాచారం కావాలన్నా జిల్లా రెవిన్యూ అధికారి అనుమతి కావాల్సిందే… లేకపోతే జిల్లా ఉన్నతాధికారికి చెప్పి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తానని, సస్పెండ్ చేస్తానని అందరినీ బెదిరిస్తాడు. అందుకే ఆయన ఆదేశాలు అంతగా పాటిస్తుంటారు ఆయా సెక్షన్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది.

కొత్త వారికి లైసెన్సులు రావు..

అయితే అయన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండే శాఖలో నెలకు పెద్దమొత్తంలో దందాలు వసూలు చేస్తున్నా ఏమి పట్టనట్లు చోద్యం చూస్తున్నాడు. ఈ వ్యవహారంలో ఆయనకు కూడా వాటా ఉందా అన్న ఆరోపణలు వినబడుతున్నాయి. దందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన శాఖల్లో ఏ.ఓ.ఎల్.ఆర్ మరియు నేషనల్ సేవింగ్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) విభాగం ఒకటి. ఈ విభాగంలో ఓక తహసిల్దార్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి పని ఎంపీకేబీవై పథకానికి అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకున్నప్పుడు వారి అర్హతలను పరిశీలించి లైసెన్స్ మంజూరు చేయాలి. ఇప్పటికే లైసెన్స్ పొందిన వారైతే వారి లైసెన్సును ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాల్సి ఉంటుంది ఇది వీరి పని. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒకప్పుడు వేలాది మంది మహిళలు ఎంపీకేబీవై ఏజెంట్లు ఉండేవారు. ప్రస్తుతం వీరి సంఖ్య వందల్లోకి చేరింది. ఎందుకంటే కొత్త వారికి లైసెన్సులు మంజూరు చేయడం లేదు, కారణం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఈ అధికారులు, సిబ్బంది చెబుతున్న విషయం. కానీ ఈ పథకాన్ని రద్దు చేసిందనడానికి ఆధారాలు చూపమంటే ఏ ఒక్కరూ చూపరు. కానీ పక్కన ఉన్న జిల్లాలో మాత్రం కొత్త లైసెన్సులు ఇప్పటికి మంజూరు చేస్తున్నారు. మరి ఈ జిల్లాలోని ఎందుకు రద్దు చేశారో ఆ దేవుడికే ఎరుక… ప్రస్తుతం కర్నూలు జిల్లాలో లైసెన్సును రెన్యువల్ మాత్రమే చేస్తున్నారు. ఈ అంశమే ఎన్ఎస్ఎస్ విభాగానికి చెందిన అధికారులకు, సిబ్బందికి కాసులు కురిపిస్తుంది.

నెలలో కనీసం 30 మంది..

జిల్లావ్యాప్తంగా ఉన్న ఏజెంట్లు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కంపల్సరిగా వారి లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ కు ఎటువంటి ఫీజు చెల్లించనక్కర్లేదు కానీ ఇక్కడ మాత్రం కాసులు ఇస్తేనే ఏజెన్సీ రెన్యువల్ అవుతుంది. ఈ వ్యవహారం నిన్న మొన్నటి నుంచి కాదండోయ్ గత కొన్నేళ్లుగా సాగుతున్న వ్యవహారమే. ఈ విభాగంలో ఎవరు అధికారిగా పనిచేసినా ఇదే వ్యవహారమే నడుస్తూ ఉంటుంది. గత ఐదేళ్ల నుండి ఇదే సెక్షన్ లో పనిచేస్తున్న తహసీల్దార్, క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్, సిబ్బంది అక్రమ సంపాదనకు అలవాటు పడి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటే వెంటనే అయితే 6వేలకు పైగా, వారం, పదిరోజుల్లో అయితే నాలుగు వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ప్రతి నెలలో కనీసం 30 మంది లైసెన్సుదారులు రెన్యువల్ కోసం ఈ కార్యాలయానికి వస్తూ ఉంటారు అంటే నెలకు సరాసరి లక్షకు పైగానే సమర్పించుకుంటున్నట్లు పలువురు ఎంపీకేబీవై ఏజెంట్లు బాహాటంగానే చెబుతున్నారు. ఎవరితోనైనా రేకమెండేషన్ చేయిస్తే ఫైల్ ఆలస్యంతో పాటు ఫైన్ రూపంలో ఎక్కువ మొత్తంలో సమర్పించుకోవాల్సి ఉంటుంది ఒక్కోసారి లైసెన్సును రెన్యువల్ చేయకుండా నిలిపివేయడం, ఒకటికి పది సార్లు కర్నూలుకు తిప్పుకోవడం చేస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీకేబివై ఏజెన్సీ రెన్యువల్ చేయాలంటే ఎవరైనా కర్నూలులో ఉన్న ఎన్ ఎస్ ఎస్ విభాగానికి రావలసిందే. కానీ జిల్లా కార్యాలయానికి రావాలంటే ఖర్చు, సమయం వృధా అవుతుందని వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆ అధికారి. పదివేలకు పైగా సమర్పించుకుంటే ఇంటి దగ్గర ఉన్నా ఏజెన్సీ రెన్యువల్ అయిపోతుందంటే మీరు నమ్మరు కదా…! ఇది ఎలా అంటే జిల్లా వ్యాప్తంగా నంద్యాల, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, డివిజన్లలో కొంతమంది నమ్మకమైన ఏజెంట్లను ఎవరికివారే నియమించుకున్నారు ఇక్కడి తహసిల్దార్, సిబ్బంది. ఆ ఏజెంట్లను సంప్రదిస్తే ఇంటి వద్ద ఉన్నా లైసెన్స్ పునరుద్ధరణ అయిపోతుంది. అంతేకాదండోయ్ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని కూడా ఆ అధికారి, సిబ్బంది వినియోగించుకుంటున్నారు.

ఓన్లీ ఫోన్ పే ద్వారా..

లైసెన్స్ పునరుద్ధరణకు డబ్బులు క్యాష్ రూపంలో తీసుకోరు… ఓన్లీ ఫోన్ పే ద్వారానే అదీ వారీ రక్త సంబంధీకుల, కుటుంబ సభ్యుల, బందువర్గాలకు చెందిన నెంబర్లకు మాత్రమే ఫోన్ పే చెయ్యాలి. అమౌంట్ రిసీవ్ కాగానే ఇక్కడ వచ్చి రెన్యూవల్ పునరుద్ధరణ కాపీలు తీసుకొని వెళ్లవచ్చు. ఇది ఈ కార్యాలయంలో జరుగుతున్న నిత్య తంతు…. ఎన్ఎస్ఎస్ విభాగంలో ఇంత వ్యవహారం నడుస్తున్నా దీన్ని పర్యవేక్షించాల్సిన జిల్లా రెవెన్యూ అధికారి మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం పలు ఆరోపణలకు తావిస్తుంది. రెవెన్యూలో అటెండర్ నుంచి అధికారి దాకా వారిపై అజమాయిషీ చెలాయిస్తూ, నిఘా ఉంచిన జిల్లా రెవెన్యూ అధికారి ఈ విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియాల్సి ఉంది. జిల్లాలో పరిపాలనపరంగా ఎంతో నిక్కచ్చిగా వ్యవహరించే జిల్లా సర్వోన్నత అధికారి ఈ వ్యవహారంపై దృష్టి సారించి నిజాన్ని నిగ్గుతేల్చాల్సిందే లేకపోతే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News