పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు బలాన్ని ఇస్తాయని, రోగ నిరోధక శక్తి పెరుగుదలకు తల్లిపాలు పట్టించాలని సూపర్వైజర్ సంపూర్ణ అన్నారు. ఆగస్టు ఒకటో తారీకు నుంచి ఏడో తారీఖు వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. అనంతరం ఆస్పత్రిలో ప్రసవించిన తల్లి పిల్లలను వార్డును సందర్శించి వారికి తగిన రీతిలో సూచనలు సలహాలు చేశారు.
ఈ సందర్భంగా సూపర్వైజర్ సంపూర్ణ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టించాలని, అప్పుడు వచ్చే ముర్రుపాలలో బలవర్ధకమైన న్యూట్రీషియన్లు, ప్రొటీన్లు ఉంటాయన్నారు. అవి ఇప్పించడం వలన బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని, భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు పద్మ సుజాత సరిత కృష్ణకుమారి రోజా శ్రీలక్ష్మి వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.