ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్న రోజులివి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు అర్థ బలం అంగ బలం ఉంటే సరిపోతుంది. ఈ రెండు ఉంటే కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమినైనా కబ్జా చేయవచ్చు అనేందుకు నిదర్శనం ఈ సంఘటన… వివరాల్లోకి వెళితే జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయం పక్కన సర్వే నంబర్ 467లో సుమారు 9 గుంటల ప్రభుత్వ భూమి ఉందని గతంలోనే అధికారులు తేల్చారు. దాని విలువ ప్రస్తుతం కోట్లలో పలుకుతుంది. సదరు సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిలో గతంలో ఒడ్డెర కులస్తులు బండలు కొట్టుకొని జీవించేవారు. ఆ సమయంలో అప్పటి మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి వడ్డెర కులస్తులకు కమ్యూనిటీ హాలు, పోచమ్మ తల్లి ఆలయం కోసం కేటాయించి శంకుస్థాపన చేశారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇన్నేళ్లపాటు ఆ స్థలం ఒడ్డెర కులస్తుల ఆధీనంలోనే ఉంది. కానీ సమీప భూమి పట్టాదారు ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడంతోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
👉పట్టా భూమిపై 2012 నుంచి వివాదం..
జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయం పక్కన సర్వే నంబర్ 654లో పట్టా భూమి ఉంది. దాని విక్రయ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం నెలకొంది. ఇట్టి విషయంపై 2012 నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తికి అనుకూలంగా తీర్పు వచ్చిందని ప్రచారం జరుగుతున్నప్పటికీ మరో వ్యక్తి కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. ఈ సమయంలో ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని, నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి తనకున్న అర్థబలం అంగ బలాన్ని ఉపయోగించి పట్టా భూమిలో ప్రహరి గోడ నిర్మాణం చేపట్టేందుకు మున్సిపల్ కార్యాలయం నుండి అనుమతులు తీసుకొని తనకున్న పట్టా భూమితో పాటు సర్వే నెంబర్ 467 లోని సుమారు 9 గుంటల ప్రభుత్వ భూమిలో సైతం ప్రహరీ నిర్మాణం చేపట్టాడు. ఆ సమయంలో ఒడ్డెర కులస్తులు ప్రహరీ గోడ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో వారిని భయభ్రాంతులకు గురి చేశారు. ఒక సెటిల్మెంట్ బ్యాచ్ రంగంలోకి దిగి వడ్డెర కులస్తుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని వదులుకుంటే వారికి పట్టా భూమిలోని కొంత స్థలాన్ని ఇవ్వడమే కాకుండా పోచమ్మ తల్లి గుడిని సైతం నిర్మించి ఇస్తామని మధ్యవర్తిత్వం వహించారు. దీంతో తమకు న్యాయం జరుగుతుందని భావించిన ఒడ్డెర కులస్తులు తమ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని వదులుకొని ప్రైవేటు వ్యక్తి తమకు ఇస్తానన్న స్థలంలో గుడి కట్టేందుకు సిద్ధమయ్యారు.
👉2018లో ప్రభుత్వ భూమికి, పట్టా భూమికి హద్దులు నిర్ణయించిన అధికారులు…
ప్రభుత్వ భూమి, పట్టా భూమి పక్కపక్కనే ఉండడంతో 2018లో బాధితుల ఫిర్యాదుపై స్పందించిన హుజూరాబాద్ కోర్టు ఆ భూమికి హద్దులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంది. అడ్వకేట్ జనరల్ సమక్షంలో సర్వేయర్లు ప్రభుత్వ. పట్టా భూమిని వేర్వేరుగా గుర్తించి పక్కా హద్దులు నిర్ణయించారు. ప్రభుత్వ భూమి, పట్టా భూమి రెండు కూడా
త్రికోణాకారపు లో ఉన్నట్లు గుర్తించిన మ్యాప్ ను కోర్టుకు, బాధిత ఇద్దరు వ్యక్తులకు అందించారు. ప్రస్తుతం ఆ భూమి ఇప్పుడు చతుర్భుజాకారంలోకి మారింది. దీన్ని బట్టి ప్రభుత్వ భూమి సుమారు 9 గుంటలు కబ్జాకు గురైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
👉ప్రభుత్వ భూమినే పట్టా భూమిగా మార్చిన వైనం…
జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని సర్వేనెంబర్ 467 లో సుమారు 9 గుంటల ప్రభుత్వ భూమి ఉందని గతంలో రెవెన్యూ అధికారులు హద్దులు నిర్ణయించినప్పటికీ గత కొంతకాలం క్రితం జమ్మికుంట డిప్యూటీ తాహసిల్దార్ గా పని చేసిన ఉద్యోగి సదరు ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చుతూ మున్సిపల్ కార్యాలయానికి నివేదిక అందజేయడం వెనకాల మర్మమేంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భారీ మొత్తంలోనే పలువురు అధికారులకు ముడుపులు ముట్టడంతో ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్పిడి చేయడం జరిగిందంటూ పట్టణంలో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు సైతం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టే అవకాశం మెండుగా ఉండటంతో రికార్డులను తారుమారు చేసిన అధికారుల వెన్నులో వణుకు పుడుతుంది. ప్రస్తుతం సదరు అధికారులు వేరే చోటికి బదిలీ అయ్యారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై తమకున్న పరిచయస్తుల ద్వారా ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందని తెలుసుకుంటున్నట్లు సమాచారం.
👉భూమి కబ్జాపై సర్వేకు కదిలిన అధికార యంత్రాంగం…
జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని సర్వే నెంబర్ 467లో ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించిన విషయంపై పత్రికలలో వార్త కథనాలు ప్రచురితం రావడంతో పాటు పట్టణానికి చెందిన అక్బర్ పాషా, మహేంద్ర నాథ్ గౌడ్ తాహసిల్దార్ కు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించి హద్దులు నిర్ణయించేందుకు సిద్ధమయ్యారు. గత శుక్రవారం జమ్మికుంట తహసీల్దార్ రమేష్ బాబు ఆధ్వర్యంలో డివిజన్ డిఐ ఫయాక్ అలీ, జమ్మికుంట సర్వేయర్ మనోజ్ తో పాటు పలువురు సిబ్బంది స్థలాన్ని సర్వే చేయడానికి సిద్ధం కాగా కొంత మంది అడ్డుకున్నారు. ఈ స్థలం విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న కొంతమంది వ్యక్తులు 10రోజుల సమయం ఇవ్వండి స్థలం యజమాని వస్తారు అని చెప్పడంతో అధికారులు వారికి కొంత సమయం ఇచ్చారు.
👉అక్రమ కబ్జాపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై బూతు పురాణం…
భూ కబ్జాపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై ఒక గ్రూపువారు తహసీల్దార్ ఉండగానే బూతు పురాణం మొదలు పెట్టారంటే వారు ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. భూమిని కబ్జా చేశాడని ఆరోపిస్తున్న యజమానికి తొత్తులుగా మారిన ఇద్దరు వ్యక్తులు వేరే కొంతమందిని జర్నలిస్టులపైకి ఉసిగొల్పడంతో అధికారుల ఎదుటనే జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించడం పట్ల పట్టణ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.