వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ యువ నేత నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోసాని అరెస్టును వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టలేదా అని ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలపై అరెస్ట్ చేయాల్సి వస్తే రాజకీయాల్లో ఉన్న వారందరినీ చేయాల్సి వస్తుందని చెప్పారు. సినీ ప్రముఖులను అరెస్ట్ చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఆర్జీవీ, పోసానిపై కేసులు పెట్టారన్నారు. ఇంకా చాలా మందిని అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందని.. కానీ అక్రమ కేసులకు తాము భయపడమని అంబటి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణ మురళిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సీఐ వెంకటేశ్వర్లు విచారిస్తున్నారు. అయితే విచారణ సమయంలో పోసాని తమకు సహకరించట్లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నారని తెలిపారు. ఏ ప్రశ్నలు అడిగినా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానమిస్తున్నారని చెబుతున్నారు.